అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బనగానపల్లెలో నిర్వహించిన యోగాంధ్ర-2026 కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు మరియు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రజలు, యువత, విద్యార్థులు, అధికారులు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మంత్రి యోగాసనాలు చేసి యోగా ప్రాముఖ్యతను వివరించారు.
ఉదయాన్నే పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలతో కలిసి యోగాభ్యాసం చేసిన మంత్రి, ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగా ఎంతో అవసరమని పేర్కొన్నారు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతను అందించే అద్భుతమైన సాధన యోగ అని చెప్పారు. నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని వివరించారు.
యోగ కేవలం వ్యాయామ ప్రక్రియ మాత్రమే కాదని, అది శరీరం, మనసు, ఆత్మ మధ్య సమతుల్యతను నెలకొల్పే జీవన విధానమని మంత్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. ఒత్తిడితో కూడిన ఆధునిక జీవనశైలిలో యోగ సాధన ప్రతి ఒక్కరికీ అవసరమని, దీని ద్వారా ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, మానసిక స్థైర్యం పెరుగుతాయని పేర్కొన్నారు.
యోగాంధ్ర కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా యోగా పట్ల అవగాహన పెంచుతున్నామని, ప్రతి ఇంటికి యోగాను చేరవేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెప్పారు. యోగాంధ్ర స్ఫూర్తితో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ యోగ సాధనను అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం యోగా సాధనను విస్తృతంగా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. యోగా ద్వారా ఆరోగ్యం, ఆనందం, ఆధ్యాత్మిక ప్రశాంతత సాధ్యమవుతాయని, అందరూ ప్రతిరోజూ కొంత సమయం యోగాకు కేటాయించాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సూచించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news