భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ములకలపల్లి మండలం మాదారం అటవీ ప్రాంతంలో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో మహిళ తీవ్రంగా గాయపడింది.
మృతులను ముసలిమడుగు గ్రామానికి చెందిన సాయికుమార్ (25), ఆయన భార్య సంధ్య (23), కుమారుడు మోక్షిత్ (4)గా గుర్తించారు. సాయికుమార్ తల్లి జ్యోతికి తీవ్ర గాయాలు కావడంతో ఆమెను పాల్వంచ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కుటుంబ సభ్యులు ఓ వేడుక నిమిత్తం ములకలపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా ధ్వంసమైంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఈ విషాద ఘటనతో ముసలిమడుగు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news