ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో మాదక ద్రవ్యాల నియంత్రణ అధికారులు నిర్వహించిన దాడిలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఓ ఇంట్లో డ్రగ్స్ నిల్వ ఉంచినట్లు సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు చేపట్టగా, ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు పాబ్లో పికాసోకు చెందిన అరుదైన పెయింటింగ్ బయటపడింది.
ఈ దాడిలో పికాసో పెయింటింగ్‌తో పాటు కొంత గంజాయి, ఖరీదైన విలాసవంతమైన దుస్తులు, వేల యూరోల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో ఆ పెయింటింగ్‌ను పారిస్‌లోని ఓ స్టోరేజ్ సెంటర్ నుంచి దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే అది ఎప్పుడు చోరీకి గురైందనే విషయాన్ని అధికారులు వెల్లడించలేదు.
స్వాధీనం చేసుకున్న చిత్రాన్ని పరిశీలించిన నిపుణులు అది అసలైన పికాసో పెయింటింగ్ అని నిర్ధారించారు. ఆ కళాఖండం విలువ లక్షల యూరోలు ఉంటుందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. దీంతో ఈ కేసు ఫ్రాన్స్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ అక్రమ రవాణాతో పాటు విలువైన కళాఖండం చోరీ కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. పికాసో చిత్రాన్ని ఎక్కడి నుంచి, ఎలా అపహరించారనే అంశంపై ప్రత్యేక బృందం విచారణ చేపట్టింది.
Fetching videos...
Fetching latest news...
No trending news