సమాజ సేవే లక్ష్యంగా గత 25 ఏళ్లుగా స్వర్ణభారత్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్ రజతోత్సవ వేడుకల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడుతో కలిసి మంత్రి పాల్గొన్నారు. యోగి ఆదిత్యనాథ్‌కు ఘన స్వాగతం పలికిన అనంతరం, అక్షర విద్యాలయం ప్రాంగణంలోని సోమా నైపుణ్య కేంద్రాన్ని సందర్శించి విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆలోచనల నుంచి 2001లో స్వర్ణభారత్ ట్రస్ట్ పురుడు పోసుకుందని మంత్రి నారాయణ తెలిపారు. సమాజానికి, తాను పుట్టిన ప్రాంతానికి తన వంతు సేవ చేయాలనే సంకల్పంతో ఏర్పడిన ఈ సంస్థ నేడు లక్షలాది మంది పేదలు, మహిళలు, రైతులు, గ్రామీణ యువత జీవితాల్లో మార్పు తీసుకువస్తోందన్నారు. నెల్లూరుతో పాటు విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాల్లోనూ సేవలను విస్తరించిందని పేర్కొన్నారు.
పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదనే లక్ష్యంతో విద్యా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ట్రస్ట్, గ్రామీణ యువతలో నైపుణ్యాలను పెంపొందించడం, రైతులను ఆధునిక వ్యవసాయ విధానాల ద్వారా ఆర్థికంగా బలోపేతం చేయడం, పేదలకు నాణ్యమైన వైద్యం అందించడం, మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించడం వంటి కార్యక్రమాలను కొనసాగిస్తోందని నారాయణ వివరించారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం పొందకుండా, విదేశీ సాయం తీసుకోకుండా 25 ఏళ్లుగా సేవా కార్యక్రమాలను కొనసాగించడం ప్రత్యేకత అన్నారు.
వృత్తి విద్యా శిక్షణ, సమాచార సాంకేతికత ఆధారిత గ్రామీణ శిక్షణ కేంద్రాలు, గ్రామీణ ఆరోగ్య సేవా కేంద్రం, ఉచిత దంత వైద్యశాల, కంటి వైద్య కేంద్రం, పశువైద్యశాల వంటి సేవలను ట్రస్ట్ అందిస్తోందని మంత్రి తెలిపారు. అక్షర విద్యాలయం, స్వర్ణభారతి విద్యామందిర్, వృద్ధాశ్రమం, అవగాహన సదస్సుల ద్వారా సమాజంలోని వివిధ వర్గాలకు సేవలు అందించడం ప్రశంసనీయమన్నారు.
వెంకయ్యనాయుడు కేవలం ఒక వ్యక్తి కాదని, ఒక వ్యవస్థ అని మంత్రి నారాయణ కొనియాడారు. రాజకీయ వారసత్వం లేకుండా సాధారణ కార్యకర్తగా ప్రారంభమైన ఆయన ప్రయాణం దేశంలో రెండో అత్యున్నత రాజ్యాంగ పదవైన ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదగడం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు. నెల్లూరు జిల్లాలోని మారుమూల ప్రాంతం నుంచి జాతీయ స్థాయిలో అత్యున్నత స్థానానికి ఎదిగిన వెంకయ్యనాయుడు జీవితం యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. స్వర్ణభారత్ ట్రస్ట్ నిర్వాహకులు, సిబ్బంది, వాలంటీర్లు, భాగస్వామ్య సంస్థలకు అభినందనలు తెలిపిన నారాయణ.. భవిష్యత్తులో మరింత విస్తృతంగా సేవలు కొనసాగించాలని ఆకాంక్షించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news