న్యూఢిల్లీ: పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంతంలో శాంతి నెలకొల్పేందుకు బ్రిక్స్ దేశాలు తమ వంతు పాత్ర పోషించాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు, దేశాల మధ్య సహకారానికి బ్రిక్స్ ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన వేదికగా మారిందని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం వల్ల ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతోందని, ఇది అంతర్జాతీయ సమాజ ఉమ్మడి ప్రయోజనాలకు అనుకూలం కాదని అన్నారు.
న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ సదస్సులో జిన్‌పింగ్ ప్రసంగిస్తూ పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంతంలో శాంతి, ప్రశాంతత కోసం బ్రిక్స్ సభ్య దేశాలతో కలిసి చైనా పనిచేస్తుందని తెలిపారు. చరిత్రకు సరైన వైపు నిలిచి శాంతి స్థాపనకు కృషి చేయాలని సభ్య దేశాల నేతలకు సూచించారు. ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడం, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.
బ్రిక్స్ దేశాలు ప్రచ్ఛన్న యుద్ధ ఆలోచనా విధానానికి దూరంగా ఉండాలని జిన్‌పింగ్ అన్నారు. ప్రపంచ పాలన వ్యవస్థలో మరింత న్యాయం, సమానత్వం కోసం సభ్య దేశాలు కలిసి పనిచేయాలని సూచించారు. మానవాళికి ఉమ్మడి భవిష్యత్తును నిర్మించే దిశగా బ్రిక్స్ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
కృత్రిమ మేధ రంగంలోనూ బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయాలని జిన్‌పింగ్ కోరారు. కృత్రిమ మేధ ఆధారంగా కొత్త పారిశ్రామికీకరణను ప్రోత్సహించేందుకు పరస్పరం సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. అంతరిక్షం, సైబర్ ప్రపంచం, లోతైన సముద్ర ప్రాంతాల్లో ప్రపంచ పాలనకు బ్రిక్స్ నాయకత్వం వహించాలని సూచించారు. ప్రపంచ దక్షిణ దేశాల గొంతుకను మరింత బలంగా వినిపించాలని పేర్కొన్నారు.
కొత్త ఆవిష్కరణల ఆధారంగా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంతో పాటు శాంతి, సుస్థిరతను కాపాడాలని జిన్‌పింగ్ అన్నారు. వివిధ నాగరికతల మధ్య పరస్పర అవగాహన, అనుభవాల మార్పిడిని పెంచుకోవాలని సూచించారు. ప్రపంచ పాలనలో సంస్కరణలకు బ్రిక్స్ దేశాలు కృషి చేయాలని, అంతర్జాతీయ వ్యవస్థను మరింత న్యాయబద్ధంగా మార్చేందుకు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఏడు సంవత్సరాల తర్వాత తొలిసారిగా భారత్‌కు వచ్చిన జిన్‌పింగ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ భారత్ మండపంలో స్వాగతం పలికారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో తదితరులు హాజరయ్యారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్‌తో పాటు ప్రపంచ వాణిజ్య సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ, నూతన అభివృద్ధి బ్యాంకు, ఆసియా మౌలిక వసతుల పెట్టుబడి బ్యాంకు ప్రతినిధులు కూడా సదస్సులో పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news