చీరాల: ప్రభుత్వ వైద్య సేవలను మరింత బలోపేతం చేసే దిశగా చీరాల ఏరియా ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. రూ.40 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ ప్రయోగశాలను కేంద్ర కుటుంబ సంక్షేమ, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి శనివారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. అనంతరం చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి. కలిసి ల్యాబొరేటరీని పరిశీలించి, వివిధ విభాగాలను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు.
సంజీవిని ప్రాజెక్ట్ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలోని 17 జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీలు, క్రిటికల్ కేర్ బ్లాక్‌ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.1,270 కోట్లు కేటాయించిందని వెల్లడించారు. నిర్మాణాలు పూర్తయిన 12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీలు, 9 క్రిటికల్ కేర్ బ్లాక్‌లను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
వైద్య రంగంలో సమూల మార్పులు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు. జనవరి నుంచి డిజిటల్ వైద్య రికార్డులను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఇది వైద్య సేవల్లో కీలక మార్పులకు దారితీస్తుందని అన్నారు. కేంద్ర సహకారం, రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం, ప్రజల భాగస్వామ్యంతో వైద్య రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రజలు ప్రతిరోజూ పది నిమిషాలు ప్రాణాయామం, ధ్యానం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.
చీరాల ప్రాంత ప్రజలకు అత్యాధునికమైన, నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య తెలిపారు. రూ.40 లక్షలతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ఐపీఎచ్ఎల్ ద్వారా స్థానిక ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ప్రభుత్వ వైద్యశాలల్లో ఉచితంగా అందించే మెరుగైన వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
చీరాల ఏరియా ఆసుపత్రిలో మరో మూడు నెలల్లో క్రిటికల్ కేర్ బ్లాక్‌ను కూడా ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రైవేట్ వైద్యశాలల్లో కూడా లేని కొన్ని సదుపాయాలను ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులోకి తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు అవసరమైన వైద్య సేవల కోసం అధిక మొత్తంలో ఖర్చు చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రులలో అందుతున్న ఆధునిక వైద్య సదుపాయాలను వినియోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. విజయమ్మ, చీరాల ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ పి. సుభాషిణి, ఏఎంసీ చైర్మన్ కౌతారపు జనార్ధన్, సివిల్ సర్జన్ డాక్టర్ పి. శ్రీకాంత్, ఆర్ఎంఓ ఈ. హరిబాబు, వైద్యులు, వైద్య సిబ్బంది, కూటమి నాయకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news