బెంగళూరు: ఆఫ్రికాలోని బంగారు గనుల సంస్థలో తనకు 40 శాతం వాటా ఉందంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన ఆరోపణలను కర్ణాటక ప్రజాపనుల శాఖ మంత్రి సతీశ్ జార్కిహోలి సవాల్ చేశారు. తనకు 40 శాతం వాటా ఉన్నట్లు ఆధారాలు ఉంటే నిరూపించాలని డిమాండ్ చేశారు. ఈడీ ప్రకటనలో పెట్టుబడులు, ప్రజాపనుల శాఖకు సంబంధించిన అంశాలను ప్రస్తావించినప్పటికీ, ఇప్పటివరకు ఏదీ తుది నిర్ధారణ కాలేదని ఆయన స్పష్టం చేశారు.
బెంగళూరులోని తన నివాసంలో మాట్లాడిన సతీశ్ జార్కిహోలి.. ఈడీ ప్రకటనలో పేర్కొన్నవి ప్రస్తుతం అనుమానాల స్థాయిలోనే ఉన్నాయని అన్నారు. అధికారికంగా నోటీసు జారీ చేసి విచారణకు పిలిస్తే హాజరవుతామని, తమ వద్ద ఉన్న పత్రాలను సమర్పించి అన్ని అంశాలపై వివరణ ఇస్తామని తెలిపారు. 40 శాతం వాటాకు సంబంధించిన ఆధారాలు ఉంటే వాటిని బయటపెట్టాలని ఆయన కోరారు.
ప్రజాపనుల శాఖలో లంచాలకు సంబంధించిన ఆరోపణలపైనా మంత్రి స్పందించారు. ఈ వ్యవహారంలో కూడా ఈడీ కేవలం అనుమానాలను వ్యక్తం చేసిందని, ఆరోపణలు వాస్తవమా కాదా అనేది ముందుగా దర్యాప్తు ద్వారా తేలాల్సి ఉందని చెప్పారు. దర్యాప్తు పూర్తికాకముందే ఏ అంశాన్నీ తుది నిర్ణయంగా పరిగణించలేమని స్పష్టం చేశారు.
ఈడీ చర్యల వల్ల రాజకీయంగా నష్టం కలిగే అవకాశముందని సతీశ్ జార్కిహోలి అంగీకరించారు. అయితే ప్రజలే అంతిమ న్యాయస్థానమని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై ఈడీకి ఫిర్యాదు చేసిన వ్యక్తి ఎవరో తనకు తెలుసని కూడా మంత్రి వెల్లడించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో చర్చించినట్లు తెలిపారు. తదుపరి వ్యవహారాన్ని ముఖ్యమంత్రి చూసుకుంటారని చెప్పారు.
ఇదిలా ఉండగా, మాజీ మద్యం వ్యాపారి విజయ్ మాల్యా సామాజిక మాధ్యమం ఎక్స్‌లో సతీశ్ జార్కిహోలికి మద్దతుగా చేసిన పోస్టుపైనా మంత్రి స్పందించారు. మాల్యా తనకు మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు చెబుతున్నానని సతీశ్ జార్కిహోలి సంక్షిప్తంగా పేర్కొన్నారు. దీంతో ఈడీ ఆరోపణలు, రాజకీయ పరిణామాలపై కర్ణాటకలో చర్చ మరింత వేడెక్కింది.
Fetching videos...
Fetching latest news...
No trending news