తొట్టంబేడు మండల తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ ఇటీవల సస్పెండ్ అయిన డిప్యూటీ తహసీల్దార్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. సస్పెన్షన్కు గురైనా ఆయన తీరులో మార్పు కనిపించడం లేదని, తిరిగి తానే అదే పోస్టులోకి వస్తానంటూ ప్రచారం చేసుకుంటున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది. దీంతో ఆయన వ్యవహారశైలిపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
డీటీ సస్పెండ్ కావడంతో కార్యాలయంలో గతంలో నెలకొన్న భయానక వాతావరణం తొలగిపోయిందని సిబ్బంది చెబుతున్నారు. ఆయన కార్యాలయానికి వస్తున్నారంటేనే ఉద్యోగులు భయపడేవారని, నోటికొచ్చినట్లు దూషించడం, ప్రజలపై అకారణంగా ఆగ్రహం వ్యక్తం చేయడం నిత్యకృత్యంగా మారిందని ఆరోపణలు ఉన్నాయి. తన వ్యవహారశైలిని ప్రశ్నించిన విలేకరులను కేసులు పెడతామంటూ బెదిరించేవారని కూడా సిబ్బంది ఆరోపిస్తున్నారు.
వీఆర్ఏలతో తన వ్యక్తిగత పనులు చేయించుకునేవారని, కారును శుభ్రం చేయించడం వంటి పనులకు సిబ్బందిని ఉపయోగించుకునేవారని ఆరోపణలు ఉన్నాయి. తనకు అనుకూలంగా లేరనే కారణంతో ఓ మహిళా ఆర్ఐ, ఇద్దరు వీఆర్వోలను బదిలీ చేయించారని, ప్రస్తుతం ఇన్చార్జ్ ఆర్ఐపై కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం.
డీటీ సస్పెండ్ అయినప్పటి నుంచి సిబ్బంది ప్రశాంతంగా విధులు నిర్వహిస్తున్నారని, కార్యాలయ పరిపాలన సజావుగా సాగుతోందని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సస్పెండ్ అయిన డీటీపై వస్తున్న ఆరోపణలపై జిల్లా కలెక్టర్, రెవెన్యూ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తేవాలని మండల ప్రజలు, ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఆరోపణలు నిజమని తేలితే శాశ్వత చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news