భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం బలమైన స్థితిలో ఉన్నప్పటికీ, పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ఇంధన ధరల హెచ్చుతగ్గులు, సరఫరా గొలుసులో ఏర్పడే అంతరాయాలు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశముందని భారతీయ రిజర్వు బ్యాంకు తన తాజా ఆర్థిక స్థిరత్వ నివేదికలో హెచ్చరించింది. ముఖ్యంగా ముడి చమురు, సహజ వాయువు వంటి ఇంధన అవసరాల కోసం భారత్ ఇప్పటికీ దిగుమతులపై అధికంగా ఆధారపడుతున్నందున, అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు ఒక్కసారిగా పెరిగితే దాని ప్రభావం ద్రవ్యోల్బణం, రూపాయి మారకం విలువ, వాణిజ్య లోటు, ప్రభుత్వ ఆర్థిక నిర్వహణపై పడే అవకాశముందని ఆర్బీఐ పేర్కొంది ఆర్బీఐ విడుదల చేసిన అర్థవార్షిక ఆర్థిక స్థిరత్వ నివేదికలో భారత ఆర్థిక వ్యవస్థకు ఉన్న బలాలను కూడా ప్రస్తావించింది. దేశ విదేశీ మారక నిల్వలు, బ్యాంకింగ్ వ్యవస్థ బలపడడం, స్థిరమైన ఆర్థిక వృద్ధి, ప్రభుత్వ సంస్కరణలు వంటి అంశాలు బాహ్య ఆర్థిక ఒత్తిడులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుతున్నాయని పేర్కొంది. అయితే ఈ బలాలు ఉన్నప్పటికీ, ఇంధన దిగుమతులపై ఆధారపడే స్వభావం వల్ల ప్రపంచ ఇంధన మార్కెట్లలో వచ్చే షాక్‌ల నుంచి పూర్తిగా రక్షణ లభించదని నివేదిక స్పష్టం చేసింది.
పశ్చిమాసియాలో ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణలు ప్రపంచ చమురు మార్కెట్‌పై గణనీయమైన ప్రభావం చూపాయి. ఆ ప్రాంతం నుంచి ప్రపంచానికి పెద్దఎత్తున ముడి చమురు సరఫరా జరుగుతుండటంతో అక్కడ ఉద్రిక్తతలు పెరిగిన ప్రతిసారీ అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగే పరిస్థితి ఏర్పడుతోంది. భారత్ తన ముడి చమురు అవసరాల్లో అధిక భాగాన్ని దిగుమతుల ద్వారానే తీర్చుకుంటుంది. అందువల్ల చమురు ధరలు పెరిగితే దిగుమతి వ్యయం పెరగడమే కాకుండా, ఇంధన ధరల ప్రభావం రవాణా, ఎరువులు, విద్యుత్, పరిశ్రమలు, వినియోగ వస్తువుల ధరలపై కూడా పడే అవకాశం ఉంటుంది
Fetching videos...
Fetching latest news...
No trending news