అమరావతి: ఆంధ్రప్రదేశ్లో శతాబ్ద కాలంగా పరిష్కారం కాకుండా ఉన్న భూ సమస్యలను కూడా పరిష్కరిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సుదీర్ఘకాలంగా వివాదాల్లో ఉన్న రూ.5 వేల కోట్ల విలువైన 31 వేల ఎకరాల భూములకు విముక్తి కల్పిస్తున్నామని చెప్పారు. భూ వివాదాల పరిష్కారం ద్వారా ప్రభుత్వ, ప్రజల ఆస్తులకు స్పష్టత తీసుకురావడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
8వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లకు పలు కీలక సూచనలు చేశారు. దశాబ్దాలుగా, శతాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలను గుర్తించి వాటికి చట్టపరమైన, పరిపాలనా పరమైన పరిష్కారాలు చూపాలని అధికారులను ఆదేశించారు. భూ సమస్యల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించడంతో పాటు విలువైన భూములు వివాదాల్లో చిక్కుకోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు వచ్చే సమయంలో స్థానిక యువతకే ఉద్యోగ అవకాశాలు దక్కేలా నైపుణ్య శిక్షణ అందించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా స్థానిక యువతలో నైపుణ్యాలను పెంపొందించి, వారికి ఉపాధి అవకాశాలు కల్పించేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాలని సూచించారు. పరిశ్రమలు ఏర్పాటు కావడం ద్వారా స్థానికంగా ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధి అవకాశాలు పెరగాలని, అందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ ముందుగానే అందించాలని పేర్కొన్నారు.
అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ పథకాన్ని రాష్ట్ర ప్రజలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా అధికారులు విస్తృత అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచడం ద్వారా కుటుంబాలకు విద్యుత్ ఖర్చులు తగ్గడంతో పాటు పునరుత్పాదక ఇంధన వినియోగం విస్తరించే అవకాశం ఉంటుందని తెలిపారు. పథకం ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా జిల్లా స్థాయిలో ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
భూ సమస్యల పరిష్కారం, పరిశ్రమలకు అనుకూల వాతావరణం, స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ, సౌర విద్యుత్ వినియోగం వంటి అంశాలపై జిల్లా కలెక్టర్లు సమన్వయంతో పనిచేయాలని చంద్రబాబు సూచించారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూర్చేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news