ఫిలిప్పీన్స్ దేశంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన పలావాన్ ప్రావిన్స్ సమీపంలో సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక ప్యాసింజర్ ఫెర్రీలో అకస్మాత్తుగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో కనీసం ఐదుగురు దుర్మరణం చెందగా, మరో 86 మంది ఆచూకీ గల్లంతైనట్లు కోస్ట్ గార్డ్ అధికారులు గురువారం తెలిపారు. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతానికి సమీపంలో సముద్ర తీరానికి కేవలం 2.2 కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తున్న ఎం/వి జూన్ ఆస్టర్ (M/V June Aster) అనే ఫెర్రీలో బుధవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఫెర్రీ నడుస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన కోస్ట్ గార్డ్ మరియు రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద స్థలం నుంచి ఐదుగురి మృతదేహాలను ఒడ్డుకు చేర్చినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఫెర్రీలో ప్రయాణిస్తున్న మిగతావారి గురించి ఎలాంటి స్పష్టత లేకపోవడంతో గల్లంతైన 86 మంది కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సముద్రంలో ఉధృతంగా వీస్తున్న ఈదురుగాలులు మరియు మంటల తీవ్రత కారణంగా సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ ప్రమాదానికి అసలు కారణం ఏంటనే దానిపై కోస్ట్ గార్డ్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషాదకర ఘటన ఫిలిప్పీన్స్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
Fetching videos...
Fetching latest news...
No trending news