అమరావతిలో జరుగుతున్న టీడీపీ లీడర్షిప్ కాంక్లేవ్‌లో 2047 స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్‌పై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టితో రూపొందించిన వివిధ విధానాలు, వాటి ద్వారా రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలను ఆయన వివరించారు. ‘చంద్రబాబు నేడు ఆలోచించేది.. దేశం రేపు ఆలోచిస్తుంది’ అనే మాట అక్షర సత్యమని పేర్కొన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు రూపొందించిన విజన్-2020 దేశంలోనే తొలి విజన్ డాక్యుమెంట్ అని పయ్యావుల తెలిపారు. ఆ తర్వాత అనేక రాష్ట్రాలు విజన్ డాక్యుమెంట్లను రూపొందించాయని చెప్పారు. విజన్-2020ను అప్పట్లో కొందరు అవహేళన చేసినా, అదే తర్వాత అభివృద్ధికి దిక్సూచిగా మారిందన్నారు. ప్రస్తుతం నీతి ఆయోగ్‌తో కలిసి విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో పనిచేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని వెల్లడించారు.
హైటెక్ సిటీ ఏర్పాటుకు ముందే పెద్ద సంఖ్యలో ఇంజినీరింగ్ కళాశాలలను ఏర్పాటు చేసి, వాటి నుంచి బయటకు వచ్చే యువతకు ఐటీ రంగంలో అవకాశాలు కల్పించేలా చంద్రబాబు ప్రణాళికలు రూపొందించారని వివరించారు. పెద్ద ఐటీ సంస్థలను హైదరాబాద్‌కు తీసుకురావడం ద్వారా ఉమ్మడి ఏపీలో ఐటీ రంగానికి బలమైన పునాది వేశారని చెప్పారు. ఆ దూరదృష్టి వల్లే నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు ఐటీ నిపుణులుగా రాణిస్తూ గరిష్ఠ ఆదాయాలను ఆర్జిస్తున్నారని పేర్కొన్నారు.
2024లో విధ్వంసమైన రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టి అభివృద్ధి, వికాసం వైపు చంద్రబాబు నడిపిస్తున్నారని పయ్యావుల అన్నారు. గతంలో నీటి కోసం ప్రాంతాల మధ్య వివాదాలు జరిగే పరిస్థితి ఉండగా, ఇప్పుడు పోలవరం, వెలిగొండ వంటి ప్రాజెక్టులు వరుసగా పూర్తవుతున్నాయని తెలిపారు. పట్టిసీమ ద్వారా 500 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు అందించి, ప్రకాశం బ్యారేజీని సుమారు 200 సార్లు నింపి పంటలకు నీరందించినందుకు చంద్రబాబును అభినందించారు.
నియోజకవర్గాల వారీగా విజన్ ప్లాన్లు రూపొందించి అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించాయని పయ్యావుల చెప్పారు. పీపీపీ విధానంలో నిర్మించిన జేగూరుపాడు విద్యుత్ కేంద్రం ఇప్పుడు ప్రభుత్వ ఆస్తిగా మారి విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని గుర్తుచేశారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో నేతలంతా పనిచేయాలని, పీజీఆర్ఎస్ ద్వారా ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఆవిష్కరణను ముందుకు తీసుకెళ్తే సమష్టిగా విజయం సాధించగలమన్నారు.
చివరగా చంద్రబాబు టీడీపీ ఆస్తి మాత్రమే కాదని, తెలుగు జాతి ఆస్తి అని పయ్యావుల కేశవ్ చేసిన వ్యాఖ్యలకు కాంక్లేవ్‌లో పాల్గొన్న ప్రతినిధులు హర్షధ్వానాలు చేశారు. విశ్వవిద్యాలయాలు చెప్పని ఎన్నో పాఠాలు, విజ్ఞానాన్ని చంద్రబాబు తన ఆలోచనలు, పాలనా విధానాల ద్వారా అందిస్తున్నారని పయ్యావుల పేర్కొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news