అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. బీఆర్టీఎస్ రోడ్డులోని తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కొత్త పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
సెప్టెంబర్ 7 నుంచి 16వ తేదీ వరకు కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరించడంతో పాటు ఆన్లైన్ నమోదు, ఈ-కేవైసీ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. అర్హత ఉన్న వారు తమ సమీప సచివాలయంలో దరఖాస్తు చేసుకుని ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు కూడా ఈ-కేవైసీ చేయించుకుని తమ దరఖాస్తులను నవీకరించుకోవాలని కోరారు.
సెప్టెంబర్ 17 నుంచి 21 వరకు అర్హత పరిశీలన, భౌతిక ధ్రువీకరణ, సంబంధిత శాఖల ద్వారా ధ్రువీకరణ చేపడతారని బొండా ఉమా తెలిపారు. సెప్టెంబర్ 22 నుంచి 24 వరకు తుది పరిశీలన, నిర్ణయం, అర్హులైన దరఖాస్తుల సిఫార్సు జరుగుతుందని చెప్పారు. సెప్టెంబర్ 25, 26 తేదీల్లో బడ్జెట్ ప్రతిపాదనలు, ప్రభుత్వ ఆమోద ప్రక్రియ ఉంటుందని వెల్లడించారు.
వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, డప్పు కళాకారులు, సంప్రదాయ చెప్పుల తయారీదారులు, ట్యాడీ ట్యాపర్లు, ట్రాన్స్జెండర్ తదితర కేటగిరీల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తుదారులు ఆధార్ కార్డు, రైస్ కార్డు లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రంతో పాటు సంబంధిత కేటగిరీకి అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించాలని సూచించారు.
పేద, బలహీన వర్గాల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ ప్రయోజనం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. నిర్ణీత గడువులో దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అర్హులైన వారికి విజ్ఞప్తి చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news