అమరావతి: విద్యాశాఖకు సంబంధించిన పలు అంశాలపై మంత్రి నారా లోకేష్ జిల్లా కలెక్టర్లకు కీలక సూచనలు చేశారు. పాఠశాలల్లో వంద శాతం ఫలితాలు సాధించేలా ప్రతి జిల్లాలో కలెక్టర్లు సమగ్ర కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు పాఠశాలల స్థాయిలో అవసరమైన చర్యలను పర్యవేక్షించాలని సూచించారు.
పాఠశాల భవనాలు పటిష్టంగా ఉండటంతో పాటు నిర్మాణ పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థులకు సురక్షితమైన, మెరుగైన వాతావరణం కల్పించేలా పాఠశాలల మౌలిక వసతులను పర్యవేక్షించాలని కలెక్టర్లకు సూచించారు. భవనాల నిర్మాణం, మరమ్మతులు, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
ఇక యువతకు ఉపాధి అవకాశాలు పెంచే దిశగా ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలను వివిధ పరిశ్రమలతో అనుసంధానం చేస్తున్నామని నారా లోకేష్ తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులు, యువత అందిపుచ్చుకునేలా శిక్షణా విధానాలను రూపొందిస్తున్నామని చెప్పారు. విద్యా సంస్థల్లో అందించే సాంకేతిక విద్య పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
యువతకు ఉద్యోగ అవకాశాలను మరింత చేరువ చేసేందుకు ‘నైపుణ్యం వెబ్ పోర్టల్’ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఈ పోర్టల్ ద్వారా ఉద్యోగ అవకాశాలతో పాటు వివిధ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేందుకు అవసరమైన స్కిల్ టూల్స్ కూడా యువతకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలను అనుసంధానం చేయడం ద్వారా యువతకు మెరుగైన భవిష్యత్ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
పాఠశాల విద్యలో మెరుగైన ఫలితాలతో పాటు ఉన్నత విద్య, సాంకేతిక విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాల్లోనూ సమన్వయంతో ముందుకు వెళ్లాలని నారా లోకేష్ సూచించారు. జిల్లాల వారీగా విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు, నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలపై కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షణ చేపట్టి అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news