కొత్తగూడెం నగరపాలక సంస్థలో ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ప్రతి బుధవారం 'ప్రజావాణి' కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మేయర్ మూద్ గణేష్ ప్రకటించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన తొలి ప్రజావాణి కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులతో కలిసి ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించి, సమస్యల పరిష్కారంపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలో మంచినీటి సరఫరా, వీధి దీపాలు, పారిశుద్ధ్యం వంటి సమస్యలు అత్యంత ప్రాధాన్యమైనవని తెలిపారు. క్షేత్రస్థాయిలోనే ప్రజల సమస్యలను పరిష్కరించేలా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. చిన్నచిన్న ఫిర్యాదులు నేరుగా కమిషనర్ లేదా మేయర్ స్థాయికి వచ్చే పరిస్థితి లేకుండా సంబంధిత అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆదేశాల మేరకు ప్రజలకు అధికారులు సులభంగా అందుబాటులో ఉండేలా ప్రతి బుధవారం ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. నగర ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్ పరిధిలో పనిచేస్తున్న అధికారులు ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని మేయర్ హెచ్చరించారు. క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరును ఆయా శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, ప్రజల్లో నగరపాలక సంస్థపై విశ్వాసం పెరిగేలా చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని సూచించారు.
జఠిలమైన సమస్యలు మినహా మిగిలిన అన్ని ఫిర్యాదులను స్థానిక స్థాయిలోనే పరిష్కరించాలని, నిర్లక్ష్యం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవడంలో వెనుకాడబోమని స్పష్టం చేశారు. కమిషనర్ మాట్లాడుతూ మేయర్ సూచనల మేరకు పటిష్ట కార్యాచరణ రూపొందించి ప్రజల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపడతామని తెలిపారు.
ఈ ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 26 దరఖాస్తులు అందాయి. వాటిలో పారిశుద్ధ్యానికి సంబంధించినవి 6, టౌన్ ప్లానింగ్‌కు 5, ఇంటి పన్నులకు 4, ఇంజినీరింగ్ విభాగానికి 5, చేయూత పెన్షన్‌కు 4, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినవి 2 దరఖాస్తులు ఉన్నాయి. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ విజయానంద్, మేనేజర్ సత్యనారాయణ, ఆర్వో రవీందర్, టీపీఓ నవీన్, డీఈ శ్రీనివాసరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్ చౌహాన్, డీఎంసీ రాజేష్ తదితర అధికారులు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news