రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ పరిధిలోని కలెక్టరేట్ సమీపంలో కాపు భవన నిర్మాణానికి కూటమి ప్రభుత్వం కేటాయించిన 30 సెంట్ల స్థలంలో సోమవారం భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ముఖ్య అతిథులుగా హాజరై శంకుస్థాపన చేశారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కాపు భవన నిర్మాణానికి ఈ కార్యక్రమంతో అడుగు పడిందని నాయకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కాపుల కళ్యాణ మండప నిర్మాణానికి స్థలం కోసం ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయని గుర్తుచేశారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి సంకల్పించిన కార్యక్రమం నేడు సాకారం కావడం సంతోషంగా ఉందన్నారు. కాపు భవనానికి కేటాయించిన 30 సెంట్ల స్థలం విశ్వవిద్యాలయ పరిధిలోనిది కాదని స్పష్టం చేశారు. 2008లోనే 45 ఎకరాల స్థలంలో విశ్వవిద్యాలయ పరిధిని 20 ఎకరాలకు పరిమితం చేశారని వివరించారు.
మిగిలిన భూమిలో వివిధ ప్రభుత్వ సంస్థలకు స్థలాలు కేటాయించారని, కాపు భవనానికి ఇచ్చిన స్థలానికి విశ్వవిద్యాలయంతో ఎలాంటి సంబంధం లేదని మంత్రి తెలిపారు. ఈ విషయంపై ఎలాంటి అపోహలకు తావులేదన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ సత్కార్యం చేపట్టామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల కాపు భవన నిర్మాణం ప్రారంభమైందని తెలిపారు.
ప్రజా సంక్షేమం కోసం అవసరమైతే వెయ్యి చేతులంత శక్తితో పనిచేస్తానని మంత్రి దుర్గేష్ అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించినట్లుగా పెద్దన్న పాత్ర పోషిస్తూ, ఎలాంటి వివక్ష లేకుండా అన్ని కులాలు, వర్గాలను కలుపుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. భవన నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి సంపూర్ణంగా అందుబాటులోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వంతోనే దశాబ్దాల కల సాకారమైందని పేర్కొంటూ కీలక పాత్ర పోషించిన ఎంపీ పురందేశ్వరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు అల్లూరి శేషు నారాయణ, గౌరవ అధ్యక్షుడు రామినీడి మురళీ, సంఘ నాయకులు అచ్యుత రామారావు, గంగా కిషోర్, ఎస్. శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news