అమెరికా విధించే అవకాశం ఉన్న కొత్త సుంకాల (టారిఫ్లు) హెచ్చరికల మధ్య భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. బలవంతపు శ్రమ (ఫోర్స్డ్ లేబర్) ఉపయోగించి పూర్తిగా లేదా పాక్షికంగా తయారైన వస్తువుల దిగుమతులను నిషేధించేలా విదేశీ వాణిజ్య విధానంలో మార్పులు చేసింది. ఈ చర్యతో అంతర్జాతీయ వాణిజ్యంలో నైతిక ప్రమాణాలను బలోపేతం చేయడమే కాకుండా, ప్రపంచ సరఫరా గొలుసులో మానవ హక్కుల పరిరక్షణకు భారత్ కట్టుబడి ఉందనే సంకేతాన్ని ఇచ్చింది
ఈ నిర్ణయం అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం (USTR) చేపట్టిన సెక్షన్ 301 దర్యాప్తు నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ దర్యాప్తులో భారత్ సహా పలు దేశాలు బలవంతపు శ్రమతో తయారైన ఉత్పత్తుల దిగుమతులను అడ్డుకోవడంలో విఫలమయ్యాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం తన విదేశీ వాణిజ్య విధానాన్ని సవరించి, అటువంటి వస్తువుల దిగుమతులను చట్టబద్ధంగా నిషేధించే నిబంధనను చేర్చింది.
కొత్త నిబంధనల ప్రకారం, పూర్తిగా లేదా కొంత భాగమైనా బలవంతపు శ్రమతో తయారైనట్లు విశ్వసనీయ ఆధారాలు లభించిన వస్తువుల దిగుమతిని నిలిపివేయవచ్చు. ఇందుకు సంబంధించి అనుమానాస్పద ఉత్పత్తులపై విచారణ జరిపి, తగిన ఆధారాలు లభిస్తే వాటిపై నిషేధం విధించే ప్రక్రియను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) అమలు చేయనుంది. ఈ నిబంధనలు నోటిఫికేషన్ జారీ అయిన 30 రోజుల తర్వాత అమల్లోకి రానున్నాయి
ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల పరిరక్షణ, నైతిక వాణిజ్యానికి ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ చర్యను భారత్ కీలక సంస్కరణగా భావిస్తోంది. అంతర్జాతీయ కంపెనీలు కూడా తమ సరఫరా గొలుసుల్లో బలవంతపు శ్రమ లేకుండా చూసేందుకు కఠిన విధానాలను అమలు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ వాణిజ్య ప్రమాణాలకు అనుగుణంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అమెరికా ఇప్పటికే బలవంతపు శ్రమకు సంబంధించిన అంశాలపై పలు దేశాలపై అదనపు సుంకాలు విధించే అవకాశాన్ని పరిశీలిస్తోంది. భారత్ సహా దాదాపు 60 దేశాలపై దర్యాప్తు కొనసాగుతుండగా, తగిన చర్యలు తీసుకోని దేశాలపై అదనపు దిగుమతి సుంకాలు విధించే ప్రతిపాదనను అమెరికా పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ తీసుకున్న చర్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడంలో సహాయపడవచ్చని నిపుణులు చెబుతున్నారు
Fetching videos...
Fetching latest news...
No trending news