విజయవాడలో గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. కేసులో ఇప్పటికే నిందితులను విచారించిన సిట్ అధికారులు మరోసారి వారి కస్టడీ కోరుతూ కోర్టును ఆశ్రయించారు. దర్యాప్తులో కొత్త అంశాలు వెలుగులోకి రావడంతో నిందితులను మరోసారి విచారించాల్సిన అవసరం ఉందని సిట్ అధికారులు భావిస్తున్నారు.
ఏ2 అశోక్ కుమార్, ఏ3 జంగం నాని, ఏ4 బాబూరావు, ఏ6 సాంబయ్య, ఏ7 వెంకటరాజును రెండు రోజులపాటు కస్టడీకి అప్పగించాలని కోరుతూ సిట్ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఐదుగురు నిందితులను మరోసారి విచారించడం ద్వారా కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను సేకరించాలని సిట్ భావిస్తోంది.
కేసు దర్యాప్తులో భాగంగా సీఐ నాగరాజు ఇచ్చిన వాంగ్మూలం కీలకంగా మారినట్లు తెలుస్తోంది. సీఐ నాగరాజు స్టేట్మెంట్లో వెల్లడైన అంశాల ఆధారంగా నిందితులను రెండోసారి విచారించాలని సిట్ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. గత విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలతో పాటు తాజాగా లభించిన సమాచారాన్ని పరస్పరం సరిపోల్చేందుకు ఈ కస్టడీ అవసరమని సిట్ భావిస్తోంది.
గాదె సాయికృష్ణ మృతి ఘటనపై ఇప్పటికే సిట్ అధికారులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు ముందు, ఘటన సమయంలో, అనంతరం చోటుచేసుకున్న పరిణామాలపై వివరాలను సేకరిస్తున్నారు. సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలు, అందుబాటులో ఉన్న ఆధారాలు, పోలీసు అధికారుల పాత్రకు సంబంధించిన అంశాలను కూడా దర్యాప్తులో పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోసారి కస్టడీకి అనుమతి కోరుతూ సిట్ దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు కీలకంగా మారింది. నిందితులకు రెండు రోజుల కస్టడీ లభిస్తే సిట్ అధికారులు సీఐ నాగరాజు స్టేట్మెంట్ ఆధారంగా పలు అంశాలపై ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ విచారణలో కేసుకు సంబంధించి మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయా అనే ఆసక్తి నెలకొంది.
Fetching videos...
Fetching latest news...
No trending news