ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారంపై ఢిల్లీలోని కేంద్ర జల సంఘం కార్యాలయంలో సోమవారం కీలక సమావేశం జరిగింది. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన ఈ భేటీకి కేంద్ర జల సంఘం చైర్మన్ నేతృత్వం వహించారు. ఇరు రాష్ట్రాలకు చెందిన జల వనరుల శాఖల ఉన్నతాధికారులు సమావేశానికి హాజరై పలు అంశాలపై చర్చించారు.
2026 జనవరిలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర జలశక్తి మంత్రి, ఉన్నతాధికారుల మధ్య జరిగిన సమావేశానికి కొనసాగింపుగా ఈ భేటీ నిర్వహించారు. రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న జల వివాదాలపై చర్చించేందుకు అవసరమైన అంశాలతో కూడిన అజెండాను ఖరారు చేయడమే ప్రధాన ఉద్దేశంగా సమావేశం కొనసాగింది.
జనవరిలో జరిగిన భేటీ అనంతరం ఇప్పటివరకు జల వివాదాలపై అజెండా ఖరారు కాలేదు. చర్చించాల్సిన అంశాల జాబితాను అందించాలని కేంద్ర జల సంఘం ఇరు రాష్ట్రాలకు పలుమార్లు లేఖలు రాసింది. అయితే రాష్ట్రాల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో కేంద్ర జల సంఘం చైర్మన్ స్వయంగా ఈ సమావేశానికి అధికారులను ఆహ్వానించారు.
ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి పంపిణీ, ప్రాజెక్టులు, ఇతర పెండింగ్ జల అంశాలపై చర్చించి తదుపరి కార్యాచరణకు మార్గం సుగమం చేయాలని కేంద్ర జల సంఘం భావిస్తోంది. తాజా సమావేశంలో ఇరు రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకుని, చర్చించాల్సిన ప్రధాన అంశాలను క్రమబద్ధీకరించే అవకాశం ఉంది.
Fetching videos...
Fetching latest news...
No trending news