రాజమహేంద్రవరం: కార్మికుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. కార్మికుల సౌకర్యార్థం క్వారీ సెంటర్లోని కార్మిక భవన్ అభివృద్ధికి రూ.60 లక్షలు మంజూరు చేయించినట్లు చెప్పారు. నిధుల మంజూరుకు సహకరించిన ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరికి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌కు కార్మిక సంఘాల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.
టీడీపీ సీనియర్ కార్మిక నాయకులు వర్రే శ్రీనివాసరావు, నక్కా చిట్టిబాబు ఆధ్వర్యంలో కార్మిక సంఘాల ప్రతినిధులు తిలక్ రోడ్డులోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆదిరెడ్డి శ్రీనివాస్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటాయని అన్నారు.
క్వారీ సెంటర్లో నిర్మించనున్న శ్రామిక భవనానికి నిధులు మంజూరు చేయడంలో సహకరించిన ఎంపీ పురందేశ్వరికి కార్మికుల తరఫున ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. భవనానికి సంబంధించిన మిగిలిన పనులను కూడా పూర్తి చేసేందుకు తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కార్మికులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఇతర సమస్యల పరిష్కారంపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు.
కార్మికుల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు త్వరలో కార్మిక సంఘాల ప్రతినిధులు, కార్మిక శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. సమస్యలను సమగ్రంగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్మికులకు అందాల్సిన సౌకర్యాలు, హక్కులు, సంక్షేమ కార్యక్రమాల అమలుపై కూడా దృష్టి పెడతామని పేర్కొన్నారు.
ఇటీవల జరిగిన పేపర్ మిల్లు ఎన్నికల్లో టీడీపీ అనుబంధ కార్మిక సంఘమైన టీఎన్టీయూసీ అత్యధిక స్థానాలతో అతిపెద్ద సంఘంగా నిలవడం కార్మికుల్లో టీడీపీకి ఉన్న మద్దతుకు నిదర్శనమని ఎమ్మెల్యే అన్నారు. కార్మికులు తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news