రాజంపేట: నియోజకవర్గంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య సమన్వయం పూర్తిగా దెబ్బతిన్నదని టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ డైరెక్టర్ కొమరా వెంకట నరసయ్య విమర్శించారు. పరిస్థితిని వెంటనే సరిదిద్దకపోతే పార్టీకి వరుస పరాజయాలు తప్పవని హెచ్చరించారు. రాజంపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీనియర్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు.
నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం తీసుకురావడంలో పార్టీ ఇన్చార్జి విఫలమయ్యారని కొమరా వెంకట నరసయ్య ఆరోపించారు. ఈ అంశాన్ని పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణించి వెంటనే సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. సమన్వయ లోపం కారణంగా రాజంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోతే ఇన్చార్జిపై చర్యలు తప్పవని వ్యాఖ్యానించారు.
నియోజకవర్గ పరిశీలకుడిపైనా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. నాయకుల మధ్య విభేదాలను పరిష్కరించడంలో పరిశీలకుడు విఫలమయ్యారని, కొందరికి మాత్రమే అందుబాటులో ఉంటూ రిమోట్ కంట్రోల్ తరహాలో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దీంతో పార్టీలో సమన్వయం మరింత బలహీనపడిందని అన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా పార్టీ కోసం పనిచేసిన నాయకులకు పదవులు, పనులు దక్కడం లేదని కొమరా వెంకట నరసయ్య అన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని గత వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేసి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో 53 రోజులు నిర్బంధించిన సమయంలో ఒక్కరోజు కూడా రోడ్డెక్కి నిరసన తెలియజేయని కొందరు ప్రస్తుతం అధికారాన్ని చెలాయిస్తున్నారని ఆయన విమర్శించారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు తగిన గుర్తింపు దక్కాలని కోరారు.
సీనియర్ నాయకుడు ఉన్నం కిరణ్ స్వామి మాట్లాడుతూ ఇన్చార్జి వ్యవహార శైలిపై అధిష్టానానికి ఫిర్యాదు చేసినా స్పందన లేదని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలకు వెళితే అన్ని స్థానాల్లో పార్టీ పరాభవం ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వెంటనే సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి నాయకులు, కార్యకర్తల మధ్య విభేదాలను పరిష్కరించాలని కోరారు.
ఆరు మండలాల్లో పార్టీ పరిస్థితి సమన్వయ లోపంతో బలహీనపడిందని, ఇప్పటికైనా అధిష్టానం జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని నాయకులు కోరారు. కార్యక్రమంలో పుత్తా రామచంద్రయ్య, మామిల్లి ఈశ్వరయ్య, పామూరు సుబ్రహ్మణ్యం, కణితం రామ్మోహన్ నాయుడు, పసుపులేటి మల్లికార్జున, గంగపేరూరు కృష్ణారెడ్డి, సయ్యద్ చాంద్ భాషా, రాచపల్లి మౌలాలి, మలక్కాటిపల్లి శ్రీనివాస్ రెడ్డి, పల్కూరు విజయరామయ్య, ఆడిటర్ శివానంద రాయల్ తదితరులు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news