ప్రజలకు రెవెన్యూ సేవలు ఎలా అందుతున్నాయో తెలుసుకునేందుకు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వినూత్నంగా ఆకస్మిక తనిఖీ చేపట్టారు. జిల్లాలోని బుట్టాయగూడెం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన సామాన్యుడిలా సందర్శించారు. ముందస్తు సమాచారం లేకుండా కార్యాలయానికి వెళ్లిన ఎమ్మెల్యే.. అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. అధికారులు, సిబ్బంది పనితీరును గమనిస్తూ ప్రజలకు అందుతున్న సేవలపై వివరాలు తెలుసుకున్నారు.
బుట్టాయగూడెంకు చెందిన ఓ రిటైర్డ్ టీచర్ స్థల వివాదానికి సంబంధించిన సమస్య పరిష్కారం కోసం కొన్ని రోజులుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్లు ఎమ్మెల్యే దృష్టికి వచ్చింది. పలుమార్లు కార్యాలయానికి వెళ్లినా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆయన ఎమ్మెల్యే చిర్రి బాలరాజును ఆశ్రయించారు. దీంతో సమస్యను స్వయంగా తెలుసుకోవాలని నిర్ణయించుకున్న ఎమ్మెల్యే ఎలాంటి హడావుడి లేకుండా సామాన్యుడి మాదిరిగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు.
కార్యాలయంలో సుమారు గంటపాటు ఉన్న ఎమ్మెల్యే బాలరాజు.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, రెవెన్యూ సేవల అమలు తీరును నిశితంగా పరిశీలించారు. వివిధ పనుల కోసం కార్యాలయానికి వచ్చిన ప్రజలకు అధికారులు అందుబాటులో ఉంటున్నారా, దరఖాస్తులు సకాలంలో పరిష్కరిస్తున్నారా, అవసరమైన సేవలను ఆలస్యం లేకుండా అందిస్తున్నారా అనే అంశాలపై ఆరా తీశారు. ప్రజల నుంచి కూడా నేరుగా వివరాలు తెలుసుకున్నారు.
ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారంలో జాప్యం చేయకూడదని, ప్రజలు పదేపదే కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి రాకుండా చూడాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు సులభంగా, పారదర్శకంగా, సకాలంలో అందేలా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
ప్రజాప్రతినిధులు ఆకస్మికంగా ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించడం ద్వారా అధికారుల పనితీరుపై స్పష్టమైన అవగాహన ఏర్పడుతుందని ఎమ్మెల్యే బాలరాజు పర్యటన ద్వారా వెల్లడైంది. ముఖ్యంగా సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆయన అధికారులకు గుర్తుచేశారు. ఈ ఆకస్మిక పర్యటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Fetching videos...
Fetching latest news...
No trending news