తెలంగాణలో 22ఏ నిషేధిత భూముల సమస్యపై మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు తీవ్రంగా స్పందించారు. 22ఏలో భూములు ఉండటంతో సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై అసెంబ్లీలో సమగ్ర చర్చ జరుగుతుందని ప్రజలు భావించినప్పటికీ, అలా ఎందుకు జరగలేదని సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. 22ఏ భూముల సమస్యపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గుడులు, బడులు, దేవస్థానాలకు చెందిన భూములు, ప్రభుత్వ భూములు ఇతరుల పేర్లపై రిజిస్ట్రేషన్ కాకుండా నిరోధించేందుకు 22ఏ నిబంధన తీసుకొచ్చారని రఘునందన్‌రావు వివరించారు. అయితే ప్రస్తుతం ఈ నిబంధన కారణంగా నిజమైన భూయజమానులు, పేద ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. 22ఏ అంశంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అసెంబ్లీకి తగిన సమాచారం, సిద్ధత లేకుండా వచ్చారని ఆయన విమర్శించారు. ఈ అంశంపై ఎవరు మాట్లాడినా వారందరినీ ఒకే గాటన కట్టడం సరికాదని పేర్కొన్నారు.
తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సింఫనీ హోంలో రిజిస్ట్రేషన్ల సమస్య ఉండటంతోనే తాను 22ఏ భూముల అంశాన్ని ప్రస్తావించానని రఘునందన్‌రావు తెలిపారు. బీఆర్ఎస్ నేతలు కూడా ఈ సమస్యపై మాట్లాడితే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని ఎలా విమర్శిస్తారని ప్రశ్నించారు. రాజకీయ విమర్శల కంటే ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలకు పరిష్కారం చూపడమే ముఖ్యమని అన్నారు.
22ఏ జాబితాలో ఉన్న 47,440 ఎకరాలను ఎక్కడ, ఏ గ్రామాల్లో తొలగించారో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టంగా చెప్పాలని ఎంపీ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 22ఏలో చేర్చిన భూములను తాము తొలగించామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో.. ఆ భూములను 22ఏలో చేర్చిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో కూడా వెల్లడించాలని ప్రశ్నించారు. ప్రజలకు అన్యాయం చేసిన అధికారులు, కలెక్టర్లపై చర్యలు తీసుకున్నారా లేదా అన్నది ప్రభుత్వం స్పష్టం చేయాలని అన్నారు.
రాష్ట్రంలో 22ఏ కింద కోటి ఎకరాలకు పైగా భూమి ఉందని రఘునందన్‌రావు పేర్కొన్నారు. ఇంత భారీ స్థాయిలో భూములు 22ఏ జాబితాలోకి ఎలా వచ్చాయి, వాటిని ఎలా తొలగిస్తారు, ఎప్పటిలోగా సమస్యను పరిష్కరిస్తారో ప్రభుత్వం ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. 22ఏలో ఉన్న సుమారు కోటి రెండు లక్షల ఎకరాల భూములపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని కోరారు. తెలంగాణ హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసి 22ఏ భూముల సమస్యను సమగ్రంగా పరిష్కరించాలని సూచించారు.
భూ భారతి అమల్లోకి వచ్చిన తర్వాత కూడా తప్పులు జరిగాయని మంత్రి పొంగులేటి అంగీకరించారని రఘునందన్‌రావు అన్నారు. తప్పుల కారణంగా పేద ప్రజలకు అన్యాయం జరిగితే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధరణి, భూ భారతి వంటి వ్యవస్థలను తీసుకొచ్చిన రెండు పార్టీలపైనా ప్రజల్లో నమ్మకం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న అసైన్డ్ భూముల మొత్తం వివరాలతో ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని, భూ దోపిడీకి అడ్డుకట్ట వేయాలని కోరారు.
రాష్ట్రంలో నమోదైన భూ సంబంధిత కేసులపై రాష్ట్ర ప్రభుత్వమే దర్యాప్తు చేయాలని, ప్రతి అంశంలో కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని రఘునందన్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ భవిష్యత్తులో అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా 22ఏ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఎంపీ పేర్కొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news