హైదరాబాద్: డేటింగ్ పేరుతో వలపన్ని ఓ మహిళ రూ.3.35 కోట్ల భారీ మోసానికి పాల్పడిన ఘటన హైదరాబాద్లో వెలుగుచూసింది. ఫేస్బుక్, మెటాకు సంబంధించిన ప్రకటనల ద్వారా భారీగా ఆదాయం ఆర్జించవచ్చంటూ బాధితుడిని నమ్మించినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి దశలవారీగా డబ్బులు పెట్టించారు.
మొదట్లో పెట్టిన పెట్టుబడికి లాభాలు వచ్చినట్లు చూపించి బాధితుడి నమ్మకాన్ని పెంచినట్లు తెలుస్తోంది. దీంతో మరింత డబ్బు పెట్టుబడిగా పెట్టేందుకు బాధితుడు సిద్ధమైనట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో నగదు పెట్టిన అనంతరం తన డబ్బును తిరిగి తీసుకునేందుకు ప్రయత్నించగా అసలు మోసం బయటపడింది.
డబ్బు వెనక్కి తీసుకోవాలంటే తన క్రెడిట్ స్కోర్ తగ్గిపోయిందని, దాన్ని సరిచేయడానికి మరింత మొత్తాన్ని డిపాజిట్ చేయాలని మోసగాళ్లు చెప్పినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటికే భారీగా డబ్బు కోల్పోయిన బాధితుడు అనుమానంతో తెలంగాణ సైబర్ క్రైమ్ బ్యూరోను ఆశ్రయించాడు. ఫిర్యాదు స్వీకరించిన అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
డేటింగ్ పరిచయాలు, ఆన్లైన్ పెట్టుబడులు, అధిక లాభాల పేరుతో జరుగుతున్న మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పరిచయం లేని వ్యక్తులు పంపే పెట్టుబడి లింకులు, ప్రకటనలు, ఖాతాలకు డబ్బులు బదిలీ చేసే ముందు పూర్తి వివరాలు పరిశీలించాలని హెచ్చరిస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news