మండుటెండను కూడా లెక్కచేయకుండా ప్రజాక్షేత్రంలో మంత్రి కొల్లు రవీంద్ర చేసిన పర్యటన ప్రజల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇంధన పొదుపు సందేశాన్ని ప్రత్యక్షంగా ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతో ఆయన ఎలక్ట్రిక్ సైకిల్‌పై తన నివాసం జగన్నాథపురం నుండి బయలుదేరి నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. ఈ పర్యటనలో ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు కూడా ఆయనతో కలిసి పాల్గొన్నారు. ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడమే కాకుండా, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు.
రైతు బజార్, ఆర్టీసీ బస్టాండ్ వంటి కీలక ప్రాంతాలను సందర్శించిన మంత్రి, అక్కడ వినియోగదారులు, వ్యాపారులు, ప్రయాణికులతో మాట్లాడి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. రైతు బజార్లో ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే పర్యావరణ సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని సూచిస్తూ, దాని వల్ల భూమి, నీరు, ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం పడుతోందని వివరించారు. వ్యాపారులు, సిబ్బంది అందరూ ప్లాస్టిక్ నిషేధాన్ని కఠినంగా పాటించాలని ఆయన సూచించారు.
ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రయాణికులతో మాట్లాడిన మంత్రి, ప్రజా రవాణా వినియోగం పెరగడం ద్వారా ఇంధన వినియోగం తగ్గుతుందని, పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని తెలిపారు. ముఖ్యంగా మహిళలతో మాట్లాడి ఉచిత బస్సు పథకం (స్త్రీ శక్తి)పై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం ఆర్థిక భారమైనప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
ఆర్టీసీ మన అందరి ఆస్తి అని, దాన్ని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు. బస్టాండ్ పరిసరాల్లో పరిశుభ్రతను కాపాడాలని అధికారులకు సూచిస్తూ, ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజలతో కలిసి నడిచినప్పుడే వారి సమస్యలు అర్థమవుతాయని, అందుకే తాను ఎప్పుడూ ప్రత్యక్షంగా ప్రజాక్షేత్రంలోనే ఉంటానని ఆయన అన్నారు.
ఈ పర్యటనలో మంత్రి కొల్లు రవీంద్ర తీసుకున్న ప్రజా అనుసంధాన దృక్పథం, ఇంధన పొదుపు సందేశం, పర్యావరణ పరిరక్షణపై ఇచ్చిన సూచనలు ప్రజల్లో మంచి స్పందనను రేపాయి. మొత్తం కార్యక్రమం ద్వారా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మరింత అవగాహన పెరిగింది.
Fetching videos...
Fetching latest news...
No trending news