అనంతపురం: ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన టీడీపీ కార్యకర్త ఆలకుంట రాము కుటుంబానికి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అండగా నిలిచారు. నగరంలోని 41వ డివిజన్ యువజన కాలనీకి చెందిన రాము తీవ్ర అనారోగ్యంతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన కుటుంబానికి ఆర్థిక సాయం అందించేందుకు సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.5.03 లక్షల చెక్కును మంజూరు చేయించారు.
రాము కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రత్యేకంగా చొరవ తీసుకుని సీఎంఆర్ఎఫ్ చెక్కు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం స్వయంగా రాము ఇంటికి వెళ్లి ఆయన సతీమణి సంగమ్మకు రూ.5.03 లక్షల చెక్కును అందజేశారు. ముందుగా సంగమ్మతో పాటు పిల్లలను పలకరించి కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
రాము మృతి చెందడం చాలా బాధాకరమని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. టీడీపీ కోసం రాము ఎంతో కష్టపడి పనిచేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం సీఎంఆర్ఎఫ్ ద్వారా కుటుంబానికి కొంత ఆర్థిక భరోసా కల్పించామని తెలిపారు. భవిష్యత్తులో కుటుంబానికి ఏ కష్టం వచ్చినా తాను, పార్టీ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
రాము పిల్లల చదువుల గురించి ఎమ్మెల్యే ఆరా తీశారు. వారు ధర్మవరంలో చదువుతున్నారని సంగమ్మ తెలిపారు. పిల్లల విద్యకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని దగ్గుపాటి ప్రసాద్ చెప్పారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ ఛైర్మన్ నారా భువనేశ్వరి దృష్టికి తీసుకెళ్లి, ట్రస్ట్ ద్వారా పిల్లలకు విద్య అందించేలా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.
కుటుంబ సభ్యులు అధైర్యపడవద్దని, ఏ అవసరం ఉన్నా తనను సంప్రదించాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యకర్తల కుటుంబాలకు టీడీపీ ప్రభుత్వం, పార్టీ నాయకత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఆపద సమయంలో కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవడం పార్టీ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు సుధాకర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ అహ్మద్, టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి దళవాయి వెంకటనారాయణ, టీడీపీ నాయకులు పెద్ద మారప్ప, వడ్డే భవాని, వడ్డే వెంకటేష్, కదిరప్ప, సీనా, వెంకటరాముడు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news