పలమనేరు: ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని అభివృద్ధి చేసి చూపిస్తున్నామని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అన్నారు. రాజకీయాలకు అతీతంగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు. పలమనేరు పట్టణంలోని గొబ్బిళ్లకోటూరు, టెర్రకోట కాలనీ, గంటావూరు ఇందిరమ్మ, వైఎస్సార్, బీసీ కాలనీల్లో “ఇంటింటికీ తెలుగుదేశం” కార్యక్రమంలో భాగంగా చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్రావుతో కలిసి శనివారం ఆయన పర్యటించారు.
ఈ సందర్భంగా సుమారు రూ.9 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టారు. గంటావూరు కాలనీ వాసులతో మాట్లాడిన ఎమ్మెల్యే, తమకు ఓటు వేసినవారు, వేయనివారనే తేడా లేకుండా ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. రహదారులు, డ్రైనేజీ, విద్యుత్, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.
అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని అమర్నాథ్ రెడ్డి అన్నారు. అభివృద్ధి చేసే నాయకులనే ప్రజలు ఆదరించి పట్టం కట్టాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఆర్డీఎస్ఎస్ పథకం ఎంతో ఉపయోగకరమని, ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని ఎమ్మెల్యే చెప్పారు. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాలకు 24 గంటల త్రీఫేజ్ విద్యుత్ అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో కుటీర పరిశ్రమలు, చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ప్రజలకు సూచించారు. ఇంటింటి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు.
వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని అమర్నాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. టెర్రకోట కళాకారులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి మట్టి వినాయక ప్రతిమలను అందజేశారు. వినాయక మండపాలకు ఉచిత విద్యుత్, చెత్తను ఉచితంగా తరలించే కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోందని ఆయన తెలిపారు. ప్రజలు పర్యావరణహితంగా, ఆహ్లాదకర వాతావరణంలో వినాయక చవితిని జరుపుకోవాలని కోరారు.
కార్యక్రమాల్లో కూటమి నాయకులు ఆర్.వి. బాలాజీ, రాజన్న, సుబ్రహ్మణ్యం గౌడు, కుట్టీ, గిరిబాబు, శ్రీధర్, ఖాజా, నాగరాజు, చాంద్ భాషా, మదన్, చెంగప్ప, కృష్ణమూర్తి గౌడు తదితరులు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news