టెకీ రాధాగాయత్రి అనుమానాస్పద మృతి కేసులో ఆమె తండ్రి సుధాకర్ సంచలన ఆరోపణలు చేశారు. తన కుమార్తెను చంపాలనే ముందస్తు ప్రణాళికతోనే ఆమె భర్త శ్రీచరణ్ మసూరీకి తీసుకెళ్లాడని ఆరోపించారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ ఘటన వెనుక పూర్తిస్థాయి కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
రాధాగాయత్రి మరణించిన తర్వాత ఉదయం ఎనిమిది గంటల సమయంలో తనకు ఫోన్ చేసి విషయం చెప్పాడని, అంతకుముందే పలువురితో సంప్రదింపులు జరిపినట్లు అనుమానిస్తున్నామని సుధాకర్ తెలిపారు. ఉత్తరాఖండ్‌లో ముందుగానే న్యాయవాదిని కూడా ఏర్పాటు చేసుకోవడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు.
భార్యపై నిజమైన ప్రేమ ఉంటే ఆమె దశదిన కర్మకు ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించిన ఆయన, సింహాచలంలోని ఇంటిని హఠాత్తుగా ఖాళీ చేయడం కూడా అనుమానాస్పదమని పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రీచరణ్ తన మొబైల్ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి విశాఖపట్నం పరిసరాల్లోనే సంచరిస్తున్నట్లు తమకు సమాచారం ఉందని చెప్పారు.
శ్రీచరణ్‌ను అతని తల్లిదండ్రులే పోలీసులకు అప్పగించాలని సుధాకర్ డిమాండ్ చేశారు. ఈ కేసులో ఉత్తరాఖండ్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి నిజానిజాలు వెలుగులోకి తీసుకురావాలని కోరారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి ఘటనలు పునరావృతం కావని అభిప్రాయపడ్డారు.
గమనిక: ఇవి రాధాగాయత్రి తండ్రి చేసిన ఆరోపణలు మాత్రమే. ఈ ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది. సంబంధిత అధికారుల విచారణ అనంతరం వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
Fetching videos...
Fetching latest news...
No trending news