రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో ఖజానా పూర్తిగా ఖాళీగా ఉందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ భయంభయంగా పాలన ప్రారంభించి, ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడుతూ, అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తున్నామని చెప్పారు.
రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని మంత్రి వెల్లడించారు. వైసీపీ పాలనలో వ్యవసాయ, నీటిపారుదల శాఖలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని విమర్శించారు. గత రెండేళ్లుగా రైతులకు భూసార పరీక్షలు నిర్వహిస్తూ, శాస్త్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు. అలాగే నీటి పొదుపు, అధిక దిగుబడుల కోసం డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను రైతులకు అందజేస్తున్నామని చెప్పారు.
వ్యవసాయ రంగంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతులు కూడా ఆధునిక పద్ధతులను అవలంబించాల్సిన అవసరం ఉందని అచ్చెన్నాయుడు సూచించారు. సంప్రదాయ సాగు విధానాలతో మాత్రమే కొనసాగితే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా ఉత్పాదకత పెంచుకోవచ్చని పేర్కొన్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, శాస్త్రీయ సలహాలు, నూతన సాంకేతికతలతో రైతులు ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news