శ్రీమతి నారా భువనేశ్వరి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కువైట్లో సుగవాసి యువసేన, ఏపీ టీడీపీ యూత్ కువైట్ సంయుక్తంగా మానవత్వాన్ని చాటుకున్నాయి. హవల్లీ ప్రాంతంలో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో ప్రమాదవశాత్తు చేతికి గాయమై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్త సుధాకర్ ఆచారికి ఆర్థిక సాయం అందజేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా నారా భువనేశ్వరి చేపడుతున్న సేవా కార్యక్రమాల స్ఫూర్తితో ఈ సహాయ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
సుగవాసి యువసేన అధ్యక్షుడు కంచన రెడ్డిశేఖర్, ఏపీ టీడీపీ కువైట్ అధ్యక్షుడు పఠాన్ ఖాదర్ ఖాన్, సుగవాసి సాయి కిరణ్, పద్మరాజు వేణురాజు, మనుబోతు సహదేవ్, ఆవుల నాగేంద్ర, పగడాల సుగుణ, కొండా మర్రి శ్రీహరి నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఖదురున్ సమక్షంలో జిలాన్ భాషా, అనీఫ్, చంద్రన్నతో పాటు పలువురు సభ్యులు సుధాకర్ ఆచారి నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు.
ఈ సందర్భంగా సుధాకర్ ఆచారికి 91 కువైట్ దినార్లు, భారత కరెన్సీలో సుమారు రూ.30,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గాయంతో ఇబ్బందులు పడుతున్న ఆయనకు ఈ సహాయం కొంత ఊరటనిస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు. అలాగే ఆయన త్వరగా కోలుకుని సాధారణ జీవితంలోకి రావాలని ఆకాంక్షించారు.
విదేశాల్లో ఉన్నప్పటికీ స్వదేశ ప్రజల పట్ల బాధ్యతతో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. నారా భువనేశ్వరి జన్మదినాన్ని కేవలం వేడుకలకే పరిమితం చేయకుండా, అవసరంలో ఉన్న వ్యక్తికి సహాయం అందించడం ద్వారా సేవా భావాన్ని చాటిన సుగవాసి యువసేన, ఏపీ టీడీపీ యూత్ కువైట్ సభ్యులను స్థానిక తెలుగు సంఘాల ప్రతినిధులు అభినందించారు. ఈ కార్యక్రమం ద్వారా మానవత్వం, సామాజిక బాధ్యత, సేవా దృక్పథం ఎంత ముఖ్యమో మరోసారి నిరూపితమైంది.
Fetching videos...
Fetching latest news...
No trending news