ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రైల్వే కోడూరు నియోజకవర్గంలోని రాఘవరాజుపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమానికి రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి, కూడ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, ఆయన సతీమణి ముక్కా వరలక్ష్మి, యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ ఎర్రగుండ్ల జయప్రకాష్ నాయకత్వం వహించారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై స్వచ్ఛందంగా రక్తదానం చేసి సామాజిక బాధ్యతను చాటుకున్నారు.
రక్తదాన శిబిరం అనంతరం నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు ఆమెకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రక్తదానం చేసిన ప్రతి దాతకు ప్రత్యేకంగా సర్టిఫికెట్లు అందజేసి వారి సేవా భావాన్ని అభినందించారు. అలాగే కార్యక్రమానికి విచ్చేసిన నాయకులు, కార్యకర్తలకు ముక్కా రూపానంద రెడ్డి స్వయంగా భోజనాలు వడ్డించడం విశేషంగా నిలిచింది.
ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ నారా భువనేశ్వరి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం, సామాజిక సేవ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయాణంలో ఆమె కీలకమైన పాత్ర పోషించారని, పార్టీ బలోపేతం కోసం కూడా విశేష కృషి చేశారని పేర్కొన్నారు. ప్రజాసేవ పట్ల ఆమెకున్న అంకితభావం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు.
ముక్కా వరలక్ష్మి మాట్లాడుతూ మహిళా సాధికారతకు నారా భువనేశ్వరి ఒక ఆదర్శమూర్తి అని అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పేదలకు విద్యా సహాయం, ఆరోగ్య సేవలు, విపత్తుల సమయంలో సహాయక కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందారని తెలిపారు. ఆమె జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరం నిర్వహించడం ద్వారా ప్రాణదానానికి సమానమైన సేవ చేయాలనే సందేశాన్ని ప్రజలకు అందించామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా రక్తదానం ప్రాముఖ్యతపై అవగాహన పెంచడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించినట్లు నిర్వాహకులు తెలిపారు. రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజల తరఫున నారా భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజానికి మార్గదర్శకురాలిగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news