యోగాను కేవలం ఒకరోజు కార్యక్రమంగా కాకుండా జీవితాంతం ఆచరించే ఆరోగ్యకరమైన జీవన విధానంగా ప్రతి ఒక్కరూ స్వీకరించాలని చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ. రాజేంద్రన్ పిలుపునిచ్చారు. చిత్తూరులోని పి.వి.కె.ఎన్ డిగ్రీ కళాశాల మైదానంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్ర–2026 కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, విద్యార్థులు, వృద్ధులు మరియు యోగా సాధకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జూన్ 7 నుంచి జూన్ 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా యోగాంధ్ర–2026 కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు. యోగా ర్యాలీతో ప్రారంభమైన ఈ కార్యక్రమాలు ప్రస్తుతం గ్రామ స్థాయికి విస్తరించాయని చెప్పారు. జిల్లాలో యోగా గురువులను గుర్తించి వారి ద్వారా 200 మంది మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ అందించామని వెల్లడించారు. అనంతరం ప్రతి సచివాలయానికి యోగా శిక్షకులను ఎంపిక చేసి మొత్తం 9 వేల మందికి పైగా ట్రైనర్లను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.
ప్రతి సచివాలయంలో యోగా శిక్షకులు కనీసం 100 మంది సభ్యులను గుర్తించి గ్రామ స్థాయిలో యోగా శిక్షణ అందించనున్నట్లు ఆయన తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా యోగా పోటీలు, యోగా ప్రశ్నోత్తర పోటీలు, ప్రాణాయామ శిక్షణ, వ్యక్తిగత యోగా ప్రదర్శనలు వంటి అనేక కార్యక్రమాలను గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు.
జూన్ 12న కాణిపాకం దేవస్థానంలో, జూన్ 18న పులిగుండలో ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో భారీ స్థాయిలో ముగింపు కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రజలందరూ యోగాను కొన్ని రోజుల కార్యక్రమంగా కాకుండా జీవితాంతం ఆచరించి ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ యోగా, నడక, సరైన ఆహార నియమాలు పాటించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పారు. గత ఏడాది ఇదే వేదికపై బరువు తగ్గాలని సంకల్పించానని, ప్రస్తుతం పది నుంచి పన్నెండు కిలోల వరకు బరువు తగ్గానని తెలిపారు. యోగా వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని పేర్కొన్నారు.
రోజువారీ జీవితంలో ఒత్తిడులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే అన్నారు. తాను కూడా క్రమం తప్పకుండా యోగా చేయడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొనేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఆరోగ్యవంతమైన చిత్తూరు నిర్మాణమే లక్ష్యంగా యోగాంధ్ర–2026 కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలందరూ యోగా సాధనలో భాగస్వాములు కావడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు సమతుల్య జీవనశైలి అలవడుతుందని కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news