విశాఖపట్నం శ్రీహరిపురానికి చెందిన మెరైన్ చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్ మృతి కుటుంబ సభ్యులను, బంధువులను, స్థానికులను తీవ్ర విషాదంలో ముంచేసింది. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న ఓ నౌకపై జరిగిన క్షిపణి దాడిలో సురేష్ ప్రాణాలు కోల్పోయారు. మొదట ఆయన గల్లంతయ్యారని సమాచారం రావడంతో కుటుంబ సభ్యులు ఆశతో ఎదురుచూశారు. రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు చేపట్టడంతో క్షేమంగా తిరిగి వస్తారనే నమ్మకం భార్య భార్గవిలో కనిపించింది. అయితే కొద్దిసేపటికే సురేష్ మృతదేహాన్ని గుర్తించినట్లు సమాచారం రావడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. మరో పది రోజుల్లో ఇంటికి వస్తానని చెప్పి వెళ్లిన సురేష్ ఇక తిరిగి రాకపోవడంతో భార్య భార్గవి, కుమారులు నయన్, జతిన్ కన్నీరుమున్నీరవుతున్నారు. తన ఇద్దరు పిల్లలతో పాటు అనాథలైన భార్య అక్కాబావల కుమార్తెలు హరిప్రియ, హేమసాయిప్రియలను కూడా సొంత బిడ్డల్లా పెంచుతున్న సురేష్ మరణంతో నలుగురు చిన్నారులకు పెద్దదిక్కు లేకుండా పోయింది. గతంలో యెమెన్ పోర్టులో జరిగిన ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డ సురేష్, ఈసారి యుద్ధ పరిస్థితుల మధ్య జరిగిన దాడిలో మృతి చెందడం మరింత విషాదకరంగా మారింది. కుటుంబ పోషణ కోసం విదేశాల్లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో జరిగిన ఈ ఘటన అందరినీ కలచివేస్తోంది. స్థానికులు, స్నేహితులు, బంధువులు సురేష్ సేవలను గుర్తుచేసుకుంటూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news