విశాఖ ఉక్కునగర ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచిన విమల విద్యాలయం పునరుద్ధరణతో విద్యార్థులు, ఉపాధ్యాయ కుటుంబాల్లో కొత్త ఆశలు చిగురించాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఒకప్పుడు నాణ్యమైన విద్యకు చిరునామాగా నిలిచిన ఈ విద్యాసంస్థ భవిష్యత్తు అనిశ్చితిలో పడిన సమయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి శాశ్వత పరిష్కారం చూపడం ఆనందదాయకమన్నారు.
విమల విద్యాలయాన్ని ప్రభుత్వ పాఠశాలగా కొనసాగించే నిర్ణయం అనంతరం జిల్లా అధికారులతో కలిసి పాఠశాలను సందర్శించిన పల్లా శ్రీనివాసరావు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, మౌలిక వసతులు, విద్యా బోధన ఏర్పాట్లను పరిశీలించారు. విద్యార్థుల చదువులకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు.
విమల విద్యాలయం సమస్య పరిష్కారం కోసం గత ఏడాది కాలంగా నిరంతరం కృషి చేశానని పల్లా తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి సమస్యను తీసుకెళ్లి పలుమార్లు వినతిపత్రాలు సమర్పించానన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సమస్య పరిష్కారం కోసం అవిశ్రాంతంగా ప్రయత్నించినట్లు చెప్పారు.
ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లగానే వారు సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. ముఖ్యంగా నారా లోకేష్ ఈ సమస్యను అత్యంత ప్రాధాన్యంతో తీసుకుని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పరిష్కారానికి మార్గం సుగమం చేశారని కొనియాడారు. విద్యార్థుల భవిష్యత్తు, ఉపాధ్యాయుల జీవనోపాధిని దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయం వల్ల విద్యాసంస్థకు పునర్జీవం లభించిందన్నారు.
విమల విద్యాలయం పునరుద్ధరణతో 32 మంది బోధనా, బోధనేతర సిబ్బందికి ఉద్యోగ భద్రత లభించడంతో పాటు వందలాది మంది విద్యార్థుల విద్యాభవిష్యత్తు సురక్షితమైందని పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఇది కేవలం ఒక పాఠశాల కొనసాగింపుకు సంబంధించిన అంశం కాదని, ఉక్కునగర ప్రజల ఆకాంక్షలు, విద్యార్థుల భవిష్యత్తు, ఉపాధ్యాయ కుటుంబాల జీవనోపాధిని పరిరక్షించిన చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో విద్యార్థులు ప్రవేశాలు పొందడం ఈ విద్యాసంస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనమన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news