కాకినాడ జిల్లా తుని సమీపంలోని సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన మూడేళ్ల చిన్నారి జాహ్నవి కోసం జరుగుతున్న గాలింపు చర్యలు ఆరవ రోజుకూ కొనసాగుతున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి పామాయిల్ తోటలో ఉంటున్న చిన్నారి ఆడుకుంటూ ఉండగా అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో గ్రామంలో తీవ్ర ఆందోళన నెలకొంది. వందలాది మంది పోలీసులు, రెస్క్యూ సిబ్బంది, గ్రామస్థులు కలిసి విస్తృతంగా గాలిస్తున్నప్పటికీ ఇప్పటివరకు చిన్నారి ఆచూకీకి సంబంధించిన ఎలాంటి ఆధారం లభించలేదు. ఈ ఘటన రోజురోజుకూ మరింత మిస్టరీగా మారుతోంది. చిన్నారి అడవిలోకి వెళ్లిందా, ఎవరైనా తీసుకెళ్లారా లేదా మరేదైనా ప్రమాదం జరిగిందా అన్న కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. కేసులో కీలకంగా భావిస్తున్న పెంపుడు కుక్క రెండు సార్లు ఇంటికి తిరిగి రావడం కొత్త ఆశలు రేకెత్తించినా, దాని ప్రవర్తనలో మార్పులు కనిపించడంతో జీపీఎస్ ట్రాకర్ ప్రయోగాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. కుక్కను ఉపయోగించి చిన్నారి ఆచూకీ తెలుసుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా జాహ్నవి తల్లి భవానీ కన్నీరుమున్నీరవుతూ తన కుమార్తె క్షేమంగా తిరిగి రావాలని వేడుకుంటున్నారు. 50 ఎకరాలకు పైగా విస్తరించిన పామాయిల్ తోటలు, సమీప కొండలు, దట్టమైన అడవి ప్రాంతాలు, చెరువులు, గుంతలు, బావులు అన్నింటినీ డ్రోన్ల సహాయంతో జల్లెడ పట్టినా ఎలాంటి క్లూ దొరకలేదు. ఆరు రోజులుగా చిన్నారి జాడ లేకపోవడంతో కుటుంబ సభ్యుల ఆవేదన పెరుగుతుండగా, జాహ్నవి సురక్షితంగా తిరిగి రావాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ప్రార్థిస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news