సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు గ్రామంలో ఎస్సీ, ఎస్టీ కుటుంబాల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక పీఎం సూర్యఘర్ పథకాన్ని టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సోలార్ రూఫ్‌టాప్ సిస్టమ్‌లను ఏర్పాటు చేసి, వారి ఇళ్లలోనే విద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సుమారు రూ.1200 కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు పూర్తిగా ఉచితంగా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడంతో పాటు, ఉత్పత్తి అయ్యే విద్యుత్ ద్వారా వారి ఇంటి అవసరాలు తీర్చుకోవడమే కాకుండా మిగిలిన విద్యుత్‌ను అమ్ముకునే అవకాశం కూడా ఉంటుందని వివరించారు.
అదే విధంగా బీసీ, ఓసీ వర్గాలకు సబ్సిడీపై ఈ పథకం అందుబాటులో ఉందని ఆయన తెలిపారు. విద్యుత్ అంతరాయాలు లేకుండా నిరంతర సరఫరా కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ప్రతి పేద కుటుంబానికి ఉచిత విద్యుత్ అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలలుగన్న ప్రతి ఇంటికి విద్యుత్ స్వావలంబన లక్ష్యంగా ఈ పథకం అమలు అవుతోందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభిస్తుందని తెలిపారు.
విద్యుత్ బిల్లుల భారం తగ్గించి పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథక ఉద్దేశమని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, లబ్ధిదారులు, స్థానిక కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Fetching videos...
Fetching latest news...
No trending news