ఉత్తరాది, దక్షిణాది అనే ప్రాంతీయ భావనలు దేశ ఐక్యతకు ప్రమాదకరమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రాంతాల పేరుతో ప్రజలను విభజించే రాజకీయాలు దేశ ప్రయోజనాలకు అనుకూలం కావని ఆయన స్పష్టం చేశారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే వాటిపై చర్చించడం సహజమే కానీ, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నాయకులు ఉత్తరాది, దక్షిణాది అంటూ మాట్లాడటం సరైన విధానం కాదన్నారు. విభజన వాదం దేశ సమగ్రతను దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
భారతదేశం నేడు ఏకీకృత దేశంగా నిలవడానికి ఎన్నో త్యాగాలు జరిగాయని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. 570కు పైగా సంస్థానాలను విలీనం చేసి దేశ నిర్మాణం జరిగిందని, అలాంటి చారిత్రక నేపథ్యాన్ని మరిచి ప్రాంతీయ విభజనలను ప్రోత్సహించడం సరికాదన్నారు. తాను హైదరాబాద్‌కు రావొద్దని కొందరు రాజకీయ నాయకులు వ్యాఖ్యానించారని, అదే తర్కాన్ని అనుసరిస్తే ఇతర జాతీయ నాయకులకూ కొన్ని ప్రాంతాలతో సంబంధం లేదని చెప్పాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు.
యువత ఆలోచనలపై మాట్లాడుతూ, దేశ రాజకీయాలు మారాలని నేటి తరం కోరుకుంటోందన్నారు. ప్రాంతీయ వివక్ష, విద్వేష రాజకీయాలు, విధ్వంసకర ధోరణులు యువతకు నచ్చడం లేదని పేర్కొన్నారు. స్పష్టమైన ఆలోచనలు, హేతుబద్ధమైన మాటలు, ఆచరణాత్మక ఫలితాలు చూపగల నాయకత్వాన్ని యువత ఆశిస్తోందన్నారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుని వాటికి పరిష్కారాలు చూపే నాయకులకే భవిష్యత్తులో ఆదరణ ఉంటుందని చెప్పారు.
తన రాజకీయ ప్రయాణం గురించి ప్రస్తావిస్తూ, యువకుడిగా ఉన్నప్పుడు నక్సలైట్‌గా మారాలనే ఆలోచన తనకు వచ్చిందని, అయితే తన అన్నయ్య చిరంజీవి నిర్మాణాత్మకమైన మార్గం వైపు నడిపించారని తెలిపారు. సమాజానికి ఉపయోగపడే విధంగా ఆలోచించడం, ప్రజల కోసం పనిచేయడం ద్వారా మార్పు తీసుకురావచ్చని అప్పుడే అర్థమైందన్నారు.
తెలంగాణ అంశంపై స్పందిస్తూ, రాష్ట్ర విభజనకు తాను ఎప్పుడూ వ్యతిరేకం కాదని, కానీ విభజన జరిగిన విధానాన్నే వ్యతిరేకించానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించలేదని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి చెందాలని తాను కోరుకుంటానని, అక్కడ పోటీ చేయాలని తమ పార్టీ నాయకులు కూడా సూచించారని తెలిపారు. అయితే తాను ఎక్కడికి వెళ్లాలి, ఎక్కడ రాజకీయాలు చేయాలి అనేది ఇతరులు నిర్ణయించలేరని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌తో తనకు దశాబ్దాల అనుబంధం ఉందని, ఈ దేశంలో ప్రతి పౌరుడికి ఎక్కడైనా నివసించే, రాజకీయ ప్రచారం చేసే హక్కు ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తమిళనాడు, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో లక్షలాది మంది తెలుగువారు నివసిస్తున్నారని, భారతదేశం అనే భావన ప్రాంతీయ హద్దులకు అతీతమని చెప్పారు.
ప్రభుత్వాల లక్ష్యం ప్రజలకు మెరుగైన సేవలు, మౌలిక సదుపాయాలు అందించడం కావాలని, కేంద్రం నుంచి అధిక నిధులు కోరడం రాష్ట్రాల హక్కేనని పేర్కొన్నారు. నవతరం ఆశలు, ఆకాంక్షలు వేగంగా మారుతున్నాయని, వాటికి అనుగుణంగా రాజకీయాలు కూడా మారాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. దేశ ఐక్యత, అభివృద్ధి, యువత ఆశయాలే భవిష్యత్తు రాజకీయాల దిశను నిర్ణయిస్తాయని ఆయన స్పష్టం చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news