ఒమాన్‌లో ఉద్యోగం పేరుతో వెళ్లి చిక్కుకున్న అన్నమయ్య జిల్లా వయలపాడు గ్రామానికి చెందిన దూదేకుల షహ్నాజ్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచింది. వలస కార్మికుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం, వెంటనే స్పందించి ఆమెను స్వదేశానికి తిరిగి రప్పించే చర్యలు చేపట్టింది.
గత ఏడాది నవంబర్‌లో షహ్నాజ్ మస్కట్‌లో ఉద్యోగ అవకాశాల కోసం వెళ్లారు. అయితే అక్కడ ఉద్యోగ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఆమె తిరిగి స్వదేశానికి రావాలని నిర్ణయించుకున్నారు. ఈ సమయంలో ఏజెంట్ కార్యాలయం ఖర్చుల పేరుతో సుమారు రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
షహ్నాజ్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. భర్త అబూబకర్ ద్వారా ఈ విషయాన్ని ఏపీఎన్ఆర్టీ సొసైటీకి ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి ఏపీఎన్ఆర్టీ సొసైటీ ద్వారా భారత ఎంబసీకి లేఖ రాసింది. అలాగే స్థానిక పోలీసుల సహకారంతో ఏజెంట్లతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించింది.
చర్చల అనంతరం ఏజెంట్లు షహ్నాజ్‌ను స్వదేశానికి పంపేందుకు అంగీకరించారు. ఆమె ప్రయాణ ఖర్చులను కూడా భరించేందుకు ఒప్పుకున్నారు. దీంతో ఆమె మే 7న స్వదేశానికి చేరుకోనున్నారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ వలస కార్మికుల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఏపీఎన్ఆర్టీ సొసైటీ చేసిన వేగవంతమైన చర్యలను ఆయన అభినందించారు.
మొత్తానికి ఏపీలోని అధికార యంత్రాంగం చొరవతో ఒమాన్‌లో చిక్కుకున్న మహిళ సురక్షితంగా స్వదేశానికి తిరిగి వస్తుండటం కుటుంబ సభ్యులకు పెద్ద ఊరటగా మారింది.
Fetching videos...
Fetching latest news...
No trending news