నెల్లూరు నగరంలోని నర్తకి సెంటర్ వద్ద తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, స్వర్గీయ నందమూరి తారకరామారావు 103వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి తాళ్ళపాక రమేష్ రెడ్డి దంపతులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఎన్టీఆర్ విగ్రహానికి గజమాల వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమం మొత్తం “జోహార్ ఎన్టీఆర్” నినాదాలతో హోరెత్తింది.
ఈ సందర్భంగా తాళ్ళపాక దంపతులు మాట్లాడుతూ ఎన్టీఆర్ నటసార్వభౌముడిగా తెలుగు సినీ రంగాన్ని మకుటంలేని మహారాజుగా ఏలారని గుర్తు చేసుకున్నారు. ఆయన గ్రీకు శిల్పంలాంటి రూపంతో పురాణ పాత్రల్లో జీవించి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. “అన్నా అన్నా” అని కోట్లాది మంది అభిమానులతో పిలిపించుకున్న మహానాయకుడిగా ఆయన కీర్తి తరతరాలకు నిలిచిందని చెప్పారు.
ఎన్టీఆర్ తోటరాముడిగా సినీ ప్రయాణం ప్రారంభించి కోట రాముడిగా ఎదిగిన తీరు అసాధారణమని వారు అభిప్రాయపడ్డారు. కలలోనే సాధ్యమయ్యే విజయాలను నిజజీవితంలో సాధించిన వ్యక్తి ఎన్టీఆర్ మాత్రమేనని కొనియాడారు. రాజకీయాల్లోకి ప్రవేశించి తెలుగుదేశం పార్టీని స్థాపించి కొద్ది నెలల్లోనే రాష్ట్ర పగ్గాలు చేపట్టిన చరిత్ర ఆయనదని తెలిపారు.
ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ పేదల పెన్నిధిగా, మహిళా పక్షపాతిగా రామరాజ్యం స్థాపించారని తాళ్ళపాక దంపతులు పేర్కొన్నారు. ప్రజల సంక్షేమానికి ఎన్టీఆర్ చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని తెలిపారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని అభిప్రాయపడ్డారు.
ఎన్టీఆర్ వారసత్వాన్ని నారా లోకేష్ పుణికిపుచ్చుకుని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆశయ సాధనకు కృషి చేస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news