నెల్లూరు జిల్లా చరిత్రలో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ మహానాడు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేతృత్వంలో మహానాడు నిర్వహణకు అనువైన స్థలాల పరిశీలన జరిగింది. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కాకర్ల సురేష్, కృష్ణారెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ తదితరులు ఈ పరిశీలనలో పాల్గొన్నారు.
కోవూరు జాతీయ రహదారి సమీపంలోని రేగడి చెలిక వద్ద ఉన్న 110 ఎకరాల APIIC స్థలం, రాజుపాలెం సమీపంలోని ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రాంతం, అలాగే నెల్లూరు రూరల్ పరిధిలోని ఇతర స్థలాలను మంత్రి ఆనం మరియు మంత్రి పొంగూరు నారాయణ కలిసి పరిశీలించారు. అన్ని వివరాలను పార్టీ కేంద్రానికి నివేదించి, తుది వేదికను పార్టీ అధిష్టానం ఖరారు చేస్తుందని మంత్రి తెలిపారు.
ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారిగా మహానాడు నెల్లూరు జిల్లాలో జరగడం పార్టీ కార్యకర్తల అదృష్టమని పేర్కొన్నారు. నెల్లూరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా మహానాడు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆయన తెలిపారు.
మే 27, 28, 29 తేదీల్లో మహానాడు నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయని, మే 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా లక్షలాది మంది కార్యకర్తల సమక్షంలో మహానాడు నిర్వహించనున్నట్లు తెలిపారు. సుమారు 5 లక్షల మంది పాల్గొనే ఈ మహానాడు కోసం భారీ బహిరంగ సభ వేదిక, వాహనాల పార్కింగ్, భోజన వసతి, నివాస ఏర్పాట్లు వంటి అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు చెప్పారు.
మొత్తంగా చూస్తే నెల్లూరులో జరగబోయే టీడీపీ మహానాడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక చారిత్రక ఘట్టంగా నిలవనుందని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news