రాజంపేట నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా భారీ స్థాయిలో జరుగుతోందని టీడీపీ రాష్ట్ర మాజీ డైరెక్టర్, సీనియర్ నాయకుడు కొమరా వెంకట నరసయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. ఒంటిమిట్టలోని ఓ హోటల్లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మందరం, నందలూరు, టంగుటూరు, ఆడిపూరు, ఒంటిమిట్ట మండలాల్లోని దర్జీపల్లి క్వారీల నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు. చెయ్యేరు, పెన్నా నదుల పరిధిలో హిటాచీలు, జేసీబీలు ఉపయోగించి నదులను ఖాళీ చేస్తున్నారని, రాళ్లు కనిపించే స్థాయికి తవ్వకాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ప్రతిరోజూ సుమారు 25 భారీ టిప్పర్లతో ఇసుకను బెంగళూరు, చెన్నై, కందుకూరు వంటి ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ అక్రమ రవాణా వెనుక రాజకీయ, అధికార అండ ఉందని ఆరోపిస్తూ గనుల శాఖ అధికారులు మామూళ్ల మత్తులో పని చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు.
భూగర్భ గనుల శాఖ అధికారులపై ఏసీబీ విచారణ జరిపి వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు. అక్రమాలను పూర్తిగా వెలికితీయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
గత వైసీపీ ప్రభుత్వంలో కూడా వేల కోట్ల రూపాయల ఇసుక దోపిడీ జరిగిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల్లో ప్రభుత్వంపై చెడ్డ అభిప్రాయం కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ఈ సమావేశంలో మాజీ నాయకులు ఉన్నం కిరణ్ స్వామి, పుత్త రామచంద్రయ్య, మామిళ్ళ ఈశ్వరయ్య, పామూరు సుబ్రమణ్యం, డాక్టర్ శివకుమార్, గంగపేరు కృష్ణారెడ్డి, పత్తి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news