ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం ఎస్.ఎం. కన్వెన్షన్ హాల్లో మైనార్టీ సంక్షేమ శాఖ మరియు హజ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన హజ్ యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూఖ్, ఎమ్మెల్యే నజీర్, శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్, నెల్లూరు మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ తదితరులు కూడా పాల్గొన్నారు. అనంతరం మంత్రులు పచ్చ జెండా ఊపి హజ్ యాత్రను అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ముస్లిం మైనార్టీ సోదరులు అత్యంత పవిత్రంగా భావించే హజ్ యాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొనడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. జీవితంలో ఒక్కసారైనా మక్కా యాత్ర చేయాలని ప్రతి ముస్లిం భక్తుడు ఆశపడతాడని ఆయన పేర్కొన్నారు. అలాంటి పవిత్ర యాత్రకు ప్రభుత్వం తరఫున అన్ని సౌకర్యాలు కల్పించడం గర్వకారణమని ఆయన అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల అభ్యున్నతికి ఎప్పుడూ కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఒక్కొక్క యాత్రికుడికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించడంతో పాటు అన్ని అవసరమైన సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1987 మంది హజ్ యాత్రకు వెళ్తుండగా, విజయవాడ పరిసర ప్రాంతాల నుండి 353 మంది యాత్రికులు బయలుదేరడం హర్షణీయమని తెలిపారు.
ఇమామ్‌లు, మౌజమ్‌లకు ఆర్థిక సాయం అందించిన ఘనత కూడా కూటమి ప్రభుత్వానిదేనని మంత్రి గుర్తు చేశారు. త్వరలోనే మైనార్టీ కార్పొరేషన్ ద్వారా మరిన్ని ఆర్థిక సహాయ పథకాలు అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే అమరావతిలో హజ్ భవనం నిర్మాణం చేపట్టే ప్రణాళికలు ఉన్నాయని వెల్లడించారు.
ఎన్ని ఇబ్బందులు, అవాంతరాలు ఎదురైనా అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల సహకారం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అల్లా కృప తోడుగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news