మార్కాపురం జిల్లా కంభం మండలంలోని చారిత్రక కంభం చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ను కోరారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి దుర్గేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించిన ఆయన, చెరువు అభివృద్ధికి రూ.4 కోట్ల నిధులు కేటాయించాలని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కంభం చెరువు ఆసియా ఖండంలోనే అతిపెద్ద ప్రాచీన మానవ నిర్మిత చెరువులలో ఒకటని తెలిపారు. ఇంతటి చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవని ఆయన మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పర్యాటక అభివృద్ధికి అవసరమైన వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
చెరువు పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేసి ఆధునీకరించడం ద్వారా పర్యాటకులను ఆకర్షించవచ్చని, తద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. పర్యాటక రంగ విస్తరణకు ఇది కీలక ప్రాజెక్ట్ అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
మంత్రి కందుల దుర్గేష్ ఈ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలిపారు.
కంభం చెరువు అభివృద్ధికి అవసరమైన నిధుల విడుదలపై తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. చారిత్రక కంభం చెరువును అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news