హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ సమస్యకు పరిష్కారంగా మరో కీలక ఫ్లైఓవర్ నిర్మాణానికి హెచ్ఎండీఏ ముందడుగు వేసింది. రాష్ట్ర అసెంబ్లీ వెనుక భాగంలో సుమారు 1.5 కిలోమీటర్ల పొడవుతో “వై” ఆకారంలో భారీ ఫ్లైఓవర్ నిర్మించాలని ప్రణాళిక సిద్ధం చేసింది. నాంపల్లి నుంచి లక్డీకాపూల్, మాసబ్ ట్యాంక్, ఖైరతాబాద్ వైపు వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ ఫ్రీ ప్రయాణాన్ని అందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. అసెంబ్లీ సమావేశాలు, వీఐపీల రాకపోకల సమయంలో ఏర్పడే ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడనుంది.
ఫ్లైఓవర్ నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సమీపంలో ప్రారంభమై, పబ్లిక్ గార్డెన్, అసెంబ్లీ వెనుక భాగం, రైల్వే లైన్ మీదుగా లక్డీకాపూల్ జంక్షన్ వరకు కొనసాగుతుంది. అక్కడి నుంచి ఒక మార్గం మాసబ్ ట్యాంక్ వైపు, మరో మార్గం ఖైరతాబాద్ వైపు వెళ్లేలా రూపకల్పన చేశారు. దీంతో నగర కేంద్ర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. దాదాపు 99 శాతం వరకు ప్రభుత్వ భూములనే వినియోగించేలా అలైన్మెంట్ ఖరారు చేశారు. ప్రైవేట్ ఆస్తుల సేకరణ అవసరం లేకుండా ప్రణాళిక రూపొందించడం వల్ల నిర్మాణ ప్రక్రియ వేగంగా ముందుకు సాగే అవకాశం ఉంది. రూట్ మ్యాప్, డిజైన్లను కూడా అధికారులు సిద్ధం చేశారు.
ఫ్లైఓవర్ పూర్తయిన తర్వాత నాంపల్లి నుంచి వచ్చే వాహనదారులు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఎక్కువసేపు ఆగకుండా నేరుగా మాసబ్ ట్యాంక్, ఖైరతాబాద్ ప్రాంతాలకు చేరుకునే వీలుంటుంది. దీంతో ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా ఇంధన వినియోగం కూడా తగ్గే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరచడంలో ఈ ప్రాజెక్టు మరో కీలక మైలురాయిగా నిలవనుందని అధికారులు చెబుతున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news