గర్భాశయ క్యాన్సర్ నివారణలో హెచ్పీవీ వ్యాక్సిన్ కీలక పాత్ర పోషిస్తుందని ప్రముఖ గైనిక్ వైద్యనిపుణులు డాక్టర్ దానేటి శ్రీధర్ తెలిపారు. సింహద్వారం సమీపంలోని తన హాస్పిటల్లో అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా హెచ్పీవీ వ్యాక్సిన్ ప్రాముఖ్యతపై రూపొందించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అభిమానులు నిర్వహించిన కార్యక్రమాన్ని అభినందించారు.
డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ, 9 నుండి 14 ఏళ్ల వయస్సులో ఈ టీకా తీసుకోవడం అత్యంత అనుకూలమని, అయితే 45 ఏళ్ల వరకు కూడా తీసుకోవచ్చని వివరించారు. వైరస్ బారిన పడకముందే వ్యాక్సిన్ తీసుకుంటే ఇది మరింత ప్రభావవంతంగా పనిచేస్తుందని, దీర్ఘకాలిక రక్షణను అందిస్తుందని చెప్పారు. హెచ్పీవీ వ్యాక్సిన్ ద్వారా 90 శాతం కంటే ఎక్కువ హెచ్పీవీ ఆధారిత క్యాన్సర్లను నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు.
ఈ వ్యాక్సిన్ హెచ్పీవీ వైరస్ నుంచి రక్షణ కల్పిస్తుందని, ఇది ప్రధానంగా జననేంద్రియాల మధ్య స్పర్శ ద్వారా, లైంగిక సంపర్కం ద్వారా వ్యాపిస్తుందని వివరించారు. అయితే లైంగిక సంపర్కం లేకపోయినా జననేంద్రియాల మధ్య స్పర్శ ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపారు. అందుకే ముందుగానే టీకా తీసుకోవడం ద్వారా రక్షణ పొందవచ్చని సూచించారు.
కేంద్ర ప్రభుత్వం ఈ వ్యాక్సిన్ను ఉచితంగా అందిస్తోందని, అర్హులైన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. వ్యాక్సిన్ షెడ్యూల్ ప్రకారం మొదటి డోస్ తీసుకున్న తర్వాత ఒకటి నుంచి రెండు నెలల్లో రెండవ డోస్, ఆరు నెలల తర్వాత మూడవ డోస్ తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ దానేటి శ్రీధర్ ఆధ్వర్యంలో 175 మంది విద్యార్థులకు ఉచితంగా హెచ్పీవీ వ్యాక్సిన్ అందించారు. ప్రజారోగ్యంపై అవగాహన పెంచేలా సినీ అభిమానులు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ప్రశంసనీయమని ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తంగా గర్భాశయ క్యాన్సర్ నివారణలో హెచ్పీవీ వ్యాక్సిన్ ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెంచడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా నిలిచింది.
Fetching videos...
Fetching latest news...
No trending news