గుడివాడ నియోజకవర్గ అభివృద్ధి కూటమి ప్రభుత్వంలోనే వేగంగా జరుగుతోందని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. మంగళవారం ఆయన గుడివాడ నూతన బస్టాండ్ నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్ష నిర్వహించి పనుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. ప్రజల దశాబ్దాల సమస్యలు ఇప్పుడు దశలవారీగా పరిష్కారం అవుతున్నాయని ఆయన అన్నారు.
బస్టాండ్ నిర్మాణ పనుల్లో భాగంగా ఇప్పటికే మూడు అడుగుల ఫౌండేషన్ పనులు పూర్తయ్యాయని అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. మెయిన్ రోడ్డుకు నాలుగు అడుగుల ఎత్తులో లెవెలింగ్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. భారీ వర్షాలు వచ్చినా నీరు నిలవకుండా డ్రైనేజీ వ్యవస్థను బలంగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. డిజైన్ ప్రకారం నాణ్యతతో పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము బస్టాండ్లో ప్రయాణికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉచిత బస్సు ప్రయాణ పథకం గురించి మహిళల అభిప్రాయాలను తెలుసుకున్నారు. చిన్నారులతో స్నేహపూర్వకంగా మాట్లాడి, ఎండల్లో ప్రయాణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత గుడివాడ అభివృద్ధికి కొత్త దశ ప్రారంభమైందని చెప్పారు. తొలి విడతగా రూ.6 కోట్లతో బస్టాండ్ నిర్మాణం జరుగుతోందని, రెండో విడతలో ప్రాంగణ అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యాలకు పెద్దపీట వేస్తూ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని అన్నారు.
దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పరిష్కారమవుతున్నాయని ఎమ్మెల్యే చెప్పారు. బైపాస్ రోడ్డు అభివృద్ధి, శివారు కాలనీల్లో మౌలిక వసతుల కల్పన, రోడ్లు, డ్రైనేజీ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
గుడివాడ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజల అవసరాలే ప్రాధాన్యంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు.
ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, ఆర్టీసీ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Fetching videos...
Fetching latest news...
No trending news