2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. అమరావతి సచివాలయంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ దాదాపు 10 కోట్ల మంది భక్తులు పుష్కరాలకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని తెలిపారు. భక్తుల సౌకర్యం, భద్రతే ప్రధాన లక్ష్యంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఏడాది ముందుగానే పనులు ప్రారంభించడం వల్ల నాణ్యమైన మౌలిక సదుపాయాలు కల్పించగలమని ఆయన పేర్కొన్నారు.
పుష్కర నిధులను కేవలం తాత్కాలిక ఏర్పాట్లకే కాకుండా మున్సిపాలిటీల్లో శాశ్వత అభివృద్ధికి వినియోగిస్తామని మంత్రి తెలిపారు. రోడ్లు, డ్రైనేజీలు, ఘాట్లు, తాగునీటి సదుపాయాలు, పార్కుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. పర్యాటక శాఖ తరఫున టెంట్ సిటీలతో పాటు హోమ్ స్టేలను కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం జోనల్ సిస్టమ్ అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. 2015 పుష్కరాల అనుభవాలను పరిగణలోకి తీసుకుని ఈసారి మరింత మెరుగైన నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
రాజమహేంద్రవరంలో త్వరలో అఖిల శాఖల సమీక్ష నిర్వహించి కార్యాచరణను ఖరారు చేస్తామని మంత్రి వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర నిధుల సమన్వయంతో పుష్కర ఘాట్లు, రోడ్ల అభివృద్ధికి త్వరలోనే నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారు.
భక్తుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ, ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తాయని మంత్రి స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నాటికి అన్ని పనులు పూర్తి చేసి గోదావరి పుష్కరాలను చారిత్రక ఘట్టంగా మారుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news