తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా గుర్తింపు పొందిన కొరియోగ్రాఫర్ పండు మాస్టర్ జీవితం ప్రస్తుతం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇటీవల విశాఖపట్నం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయనకు రెండు కాళ్లకు శస్త్రచికిత్సలు జరిగాయి. పూర్తిగా కోలుకోవడానికి దాదాపు ఆరు నెలల సమయం పడుతుందని వైద్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో గతంలో పండు మాస్టర్ ఇచ్చిన ఇంటర్వ్యూలోని వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన తండ్రి ఆటో డ్రైవర్ అని, తాను ఎంత పేరు సంపాదించినా ఇప్పటికీ కుటుంబం ఎంతో సాధారణ జీవితమే గడుపుతోందని పండు తెలిపారు. బుల్లితెరపై మంచి గుర్తింపు, ఆదాయం వచ్చినప్పటికీ తనకు ఇప్పటివరకు సొంత ఇల్లు లేదని వెల్లడించారు. తాను సంపాదించే డబ్బులో ఎక్కువ భాగాన్ని తల్లిదండ్రుల సంతోషం కోసమే ఖర్చు పెడుతున్నానని చెప్పారు. చిన్నతనంలో తమ కుటుంబం అనుభవించలేని సౌకర్యాలు ఇప్పుడు తల్లిదండ్రులకు అందించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. తన తండ్రి ఇరవై ఏళ్లకు పైగా పాత ఆటోనే ఇప్పటికీ నడుపుతున్నారని, “నా కొడుకు సంపాదనతో కొన్న మొదటి ఆటో ఇది” అంటూ దానిపట్ల ప్రత్యేక అనుబంధం చూపుతారని భావోద్వేగంతో చెప్పారు. నెలకు వేల రూపాయలు ఖర్చు పెట్టి మరీ అదే ఆటోను రిపేర్ చేయించుకుంటూ వాడుతున్నారని వెల్లడించారు. కష్టపడి ఎదిగినా మూలాలను మర్చిపోకుండా కుటుంబాన్ని గౌరవిస్తూ ముందుకు సాగుతున్న పండు మాస్టర్ జీవితం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆయన త్వరగా కోలుకుని మళ్లీ ప్రేక్షకులను అలరించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news