శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రజావేదిక సమీపంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను ఆయన పరిశీలించారు. స్థానిక ఉత్పత్తులు, గిరిజన కళలు, స్వయం సహాయక సంఘాల తయారీ వస్తువులు వంటి అనేక అంశాలను ఆసక్తిగా తిలకించిన సీఎం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తుచేశారు.
ఈ సందర్బంగా ఐటీడీఏ ఆధ్వర్యంలో సవర ఆర్ట్ గ్యాలరీ వద్ద గిరిజనులు ప్రత్యేకంగా తయారు చేసిన ఓవర్‌కోట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కొనుగోలు చేశారు. గిరిజన కళాకారుల ప్రతిభను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆయన ఆ ఉత్పత్తిని స్వయంగా కొనుగోలు చేయడమే కాకుండా, అక్కడే ఆ ఓవర్‌కోట్‌ను ధరించారు. ఈ చర్య స్థానికంగా ఉన్న కళాకారులకు ప్రోత్సాహంగా మారింది. వారి చేతి పనులను రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో మరింత విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు.
గిరిజన ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు కల్పించడం ద్వారా వారి జీవనోపాధి మెరుగుపడుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా గిరిజన ప్రాంతాల్లో తయారయ్యే ఉత్పత్తులను బ్రాండింగ్, మార్కెటింగ్ చేయడం, డిజిటల్ వేదికలపై ప్రోత్సహించడం వంటి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
అనంతరం సముద్ర తీర ప్రాంతాల్లో విస్తృతంగా చేపట్టే సీవీడ్ సాగుపై సీఎం అధికారులు నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సాగు ద్వారా మత్స్యకారులకు అదనపు ఆదాయం లభించే అవకాశం ఉందని అధికారులు వివరించగా, దానిని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని సీఎం సూచించారు. తీర ప్రాంత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కొత్త అవకాశాలను అన్వేషించాలని ఆయన ఆదేశించారు.
ఇక శ్రీకాకుళం జిల్లా పోలీసులు ఏర్పాటు చేసిన ‘హెల్మెట్ బ్యాంక్’ కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచే ఈ వినూత్న కార్యక్రమాన్ని ఆయన ప్రశంసించారు. అవసరమైన వారికి హెల్మెట్లు అందుబాటులో ఉండేలా ఈ విధానం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా సీఎం హెల్మెట్ ధరించి బుల్లెట్ వాహనాన్ని స్వయంగా అధిరోహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రోడ్డు భద్రతను ప్రతి ఒక్కరూ పాటించాలనే సందేశాన్ని ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన ఈ చర్య తీసుకున్నారు.
మొత్తంగా నరసన్నపేట పర్యటనలో సీఎం చంద్రబాబు గ్రామీణ అభివృద్ధి, గిరిజన సంక్షేమం, మత్స్యకారుల జీవనోపాధి, రోడ్డు భద్రత వంటి అంశాలపై దృష్టి సారించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లే విధానంపై ఈ పర్యటన మరోసారి దృష్టిని ఆకర్షించింది.
Fetching videos...
Fetching latest news...
No trending news