క్యాబ్ బుక్ చేసుకునే సమయంలోనే డ్రైవర్‌కు టిప్ చెల్లించే విధానాన్ని నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం అగ్రిగేటర్లను ఆదేశించింది. ఈ విధానం వినియోగదారులను తప్పుదోవ పట్టించే అన్యాయ వ్యాపార పద్ధతిగా పరిగణిస్తున్నట్లు వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే తెలిపారు. రైడ్ పూర్తయిన తర్వాత టిప్ ఇవ్వాలా వద్దా అనేది పూర్తిగా ప్రయాణికుడి ఇష్టమని స్పష్టం చేశారు.
ముందుగానే టిప్ చెల్లించకపోతే రైడ్‌ను అంగీకరించరనే భావన ప్రయాణికుల్లో కలిగించకూడదని కేంద్రం స్పష్టం చేసింది. క్యాబ్ బుక్ చేసే సమయంలో ప్రయాణికుడికి రైడ్ లభ్యత, చార్జీలకు సంబంధించిన స్పష్టమైన సమాచారం అందించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. టిప్‌ను ముందస్తు చెల్లింపుగా చూపించడం వల్ల ప్రయాణికులు అదనపు మొత్తం చెల్లించాల్సిన ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఈ అంశంపై జాతీయ వినియోగదారుల సహాయవాణికి అనేక ఫిర్యాదులు వచ్చినట్లు నిధి ఖరే తెలిపారు. దీంతో క్యాబ్ అగ్రిగేటర్లలో టిప్ చెల్లింపులకు సంబంధించిన విధానాలను పరిశీలించారు. సాధారణంగా రైడ్ బుక్ చేసే సమయంలోనే దూరం, ప్రయాణ సమయం, ట్రాఫిక్ పరిస్థితులు, టోల్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని చార్జీ నిర్ణయిస్తారు. అలాంటి ప్రయాణానికి తర్వాత అదనంగా టిప్ చెల్లించాలని ప్రోత్సహించడం సరైన విధానం కాదని అధికారులు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ర్యాపిడోపై ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. రైడ్ బుకింగ్ సమయంలో అదనంగా రూ.10, రూ.20, రూ.30 చెల్లించాలని యాప్ సూచిస్తున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా ఎక్కువ మొత్తాన్ని ముందుగానే చెల్లిస్తే రైడ్ లభించే అవకాశం పెరుగుతుందనే భావన కలిగించే సందేశాలు కూడా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ విధానాన్ని వినియోగదారుల ప్రయోజనాలకు విరుద్ధమైన చర్యగా పరిగణించి ర్యాపిడోపై రూ.10 లక్షల జరిమానా విధించారు.
క్యాబ్ రైడ్‌కు సంబంధించిన అసలు చార్జీ, అదనపు చెల్లింపులు, టిప్ వంటి అంశాల మధ్య స్పష్టమైన తేడా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రయాణికుడు సేవను ఉపయోగించిన తర్వాత డ్రైవర్ సేవకు సంతృప్తి చెందినట్లయితే తన ఇష్టప్రకారం టిప్ ఇవ్వవచ్చు. అయితే రైడ్ బుకింగ్ దశలోనే టిప్ చెల్లించకపోతే సేవ లభించదనే పరిస్థితి ఏర్పడకూడదని స్పష్టం చేశారు.
ఇదే అంశంపై ఉబర్, ఓలా వంటి ఇతర ప్రముఖ క్యాబ్ అగ్రిగేటర్ల విధానాలపైనా దర్యాప్తు కొనసాగుతున్నట్లు నిధి ఖరే తెలిపారు. వినియోగదారులకు యాప్‌లో కనిపించే సూచనలు, రైడ్ లభ్యతకు సంబంధించిన సందేశాలు, ముందస్తు అదనపు చెల్లింపుల విధానం వంటి అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ చర్యలతో క్యాబ్ బుకింగ్‌లో పారదర్శకత పెంచడం, ప్రయాణికులపై అనవసరమైన అదనపు చెల్లింపుల ఒత్తిడిని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news